మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేసి ఇండియన్ల నియామకం: అమెరికా ఉద్యోగులు

వాషింగ్టన్/న్యూఢిల్లీ: టీసీఎస్ కంపెనీ తమను తొలగించి హెచ్ 1బీ వీసాపై ఇండియన్లను నియమించుకుందని అమెరికా ఉద్యోగులు ఆరోపించారు. షార్ట్  నోటీస్  ఇచ్చి టీసీఎస్  కంపెనీ తమను ఉద్యోగాల నుంచి తొలగించిందని, ఆ ఉద్యోగాలను హెచ్ 1బీ వీసాపై తక్కువ జీతాలకు భారతీయులకు ఇచ్చిందని అన్నారు. ఈ మేరకు వాల్ స్ట్రీట్  జర్నల్  తన కథనంలో పేర్కొంది.

దాదాపు 22 మంది అమెరికన్  వర్కర్లు టీసీఎస్ పై ఆ ఆరోపణలు చేశారని తెలిపింది. అంతేకాకుండా వయసు, జాతి ఆధారంగా ఆ కంపెనీ తమపై వివక్ష చూపిందని ఈక్వల్  ఎంప్లాయ్ మెంట్  ఆపర్చునిటీ కమిషన్ (ఈఈఓసీ) కు టీసీఎస్ పై ఆ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. వారంతా అమెరికాలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 40 నుంచి 60 ఏండ్ల మధ్య వయసు ఉన్నవారు. ‘‘సాధారణంగా కంపెనీలు లేఆఫ్ లు చేస్తుంటాయి. ఆ సమయంలో ఎక్కువ సీనియారిటీ ఉన్నవారిపై ప్రభావం పడుతుంది. కానీ, టీసీఎస్  కంపెనీ చట్టవిరుద్ధంగా మమ్మల్ని టార్గెట్  చేసుకుంది. వయసు, జాతి ఆధారంగా మాపై వివక్ష చూపి మమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగించింది. అమెరికాలో అప్పటికే హెచ్ 1బీ వీసా ఉన్న ఇండియన్  వర్కర్లకు ఆ ఉద్యోగాల్లో నియమించుకుంది” అని అమెరికన్  ఉద్యోగులు ఆరోపణలు చేశారని వాల్ స్ట్రీట్  జర్నల్  తన కథనంలో వెల్లడించింది. వారంతా బిజినెస్  అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్  డిగ్రీ చేశారని తెలిపింది.

ఆ ఆరోపణల్లో వాస్తవం లేదు: టీసీఎస్

అమెరికా ఉద్యోగులు చేసిన ఆరోపణలను టీసీఎస్  ఖండించింది. తామెప్పుడూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని, వారిపై ఎలాంటి వివక్ష చూపలేదని పేర్కొంది.