ఇన్​స్టా ప్రియుడి కోసం ఇండియాకు.. ఏపీ యువకుడితో అమెరికన్ పెళ్లి

ఇన్​స్టా ప్రియుడి కోసం ఇండియాకు.. ఏపీ యువకుడితో అమెరికన్ పెళ్లి

న్యూఢిల్లీ: అమెరికా అమ్మాయిని, ఆంధ్రా అబ్బాయిని ఇన్​స్టాగ్రామ్ కలిపింది. పలకరింపుతో మొదలైన పరిచయం ప్రేమకు దారితీసింది. పద్నాలుగు నెలల్లో పీకలలోతు ప్రేమలో పడిపోయిన అమెరికా అమ్మాయి ప్రియుడిని పెళ్లి చేసుకోవడానికి ఆంధ్రాకు ఎగిరొచ్చింది. తల్లితో కలిసి ప్రియుడి ఇంటికి చేరుకుంది. యువకుడి కంటే తొమ్మిదేండ్లు పెద్దదైనప్పటికి తమ బంధానికి వయసు అడ్డుకాదని, తొందర్లోనే పెళ్లి పీటలు ఎక్కుతామని చెబుతోంది. అమెరికాకు చెందిన జాక్లిన్ ఫోరెరోకు ఆంధ్రప్రదేశ్‌‌‌‌ కు చెందిన చందన్ అనే  ఫోటోగ్రాఫర్​తో ఇన్​స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. రోజూ చాట్ చేసుకుంటుండడంతో అది కాస్తా ప్రేమగా మారింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేమని భావించి పెళ్లితో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. 

ఈ క్రమంలోనే జాక్లిన్ తన తల్లితో కలిసి ఆంధ్రాకు వచ్చింది. ఈ సందర్భంగా తమ లవ్ స్టోరీ ఎక్కడ, ఎలా మొదలైంది వంటి వివరాలకు సంబంధించిన వీడియోను ఇన్‌‌‌‌స్టాలో పోస్ట్ చేసింది. ‘‘మా పరిచయం హాయ్ అనే మెసేజ్‎తో మొదలైంది. అనంతరం వరుసగా మెసేజ్‎లు చేసుకున్నాం. మనస్ఫూర్తిగా ఒకరి ఇష్టాలు, అభిరుచులు, అభిమతాలు మరొకరం అర్థం చేసుకున్నాం. మా పరిచయం మొదలైన 14 నెలల్లో ఎప్పుడు ప్రేమలో పడ్డామో మాకే తెలియదు. త్వరలోనే మా జీవితంలో అతి పెద్ద చాప్టర్‌‌‌‌ని ప్రారంభించబోతున్నాం. చందన్ కంటే నేను తొమ్మిదేండ్లు పెద్ద కావడంతో మా బంధంపై ప్రజలు భిన్నంగా స్పందిస్తున్నారు’’ అని జాక్లిన్ తెలిపింది.