డేంజర్​లో అమెరికా పాలిటిక్స్

అధ్యక్ష ఎన్నికల తర్వాత మారిపోయిన సీన్ గత నవంబర్​లో ప్రెసిడెన్షియల్​ ఎలక్షన్స్​ ముగిసిన తర్వాత అమెరికాలో పొలిటికల్​ సీన్​ మొత్తం మారిపోయింది. దేశం మొత్తం సిద్ధాంతాల పరంగా చీలిపోయింది. అమెరికా ఆవిర్భవించిన తర్వాత తొలిసారి తన నీచ రాజకీయాన్ని ఆ దేశం చూపెడుతోంది. గొప్ప ప్రజాస్వామ్యం, పారదర్శక ఎన్నికల వ్యవస్థ, రాజ్యాంగ రక్షణ కలిగిన వ్యక్తిగత స్వేచ్ఛ, క్రియాశీల ఫెడరల్​ రిపబ్లిక్ గురించి అమెరికన్లు గర్వంగా చెప్పుకునేవారు. కానీ, ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయాలు, సైద్ధాంతిక విభేదాలు, పార్టీల పోకడలు ఇన్నాళ్లు చెప్పుకున్న అమెరికా విలువలను దెబ్బ తీస్తున్నాయి. ఈ పరిస్థితులతో రానున్న రోజుల్లో అమెరికా రాజకీయం అస్థిరతలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఊహించని పొలిటికల్​ గేమ్స్​, కుయుక్తుల కారణంగా డేంజర్​ జోన్​లోకి చేరే అవకాశాలు ఉన్నాయి. దశాబ్దాలుగా అమెరికా సామాజిక, రాజకీయ స్వరూపాన్ని ఆరాధిస్తున్న నాలాంటి వారందరికీ రాజకీయంగా, సామాజికంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆవేదన కలిగిస్తున్నాయి. హెల్దీ, యాక్టివ్​ డెమొక్రసీకి దిక్సూచిలా నిలిచిన దేశం ఇప్పుడు అస్తవ్యస్త, ఆరాచకం వైపు జారిపోతోంది. ప్రస్తుత కుయుక్త రాజకీయాల అస్థిరత, పౌర అశాంతి అగాధంలోకి పడిపోకుండా చక్కదిద్దుకునేందుకు అమెరికాకు ఇంకా కొంత సమయమే మిగిలి ఉంది. ప్రస్తుతం ఉన్న అన్ని యాక్టివ్​ డెమొక్రటిక్​ దేశాల్లో రాజకీయ పార్టీలు ప్రాథమికంగా వేర్వేరు సిద్ధాంతాలను కలిగి ఉంటాయి. విభేదాలు, అసమ్మతి, చర్చ అనేవి ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ఊపిరి. ఈ మూడు రాజ్యాంగబద్ధంగా ఏర్పరచిన చట్టబద్ధమైన ఫ్రేమ్​వర్క్​లో అధికార, ప్రతిపక్షాల మధ్య కీలకంగా ఉంటాయి. అయితే దురదృష్టవశాత్తు, 2016 ఎన్నికల నాటి నుంచి అమెరికా రాజకీయాలు గాడితప్పాయి. దేశ ప్రయోజనాలకు సంబంధించిన ఎజెండా అమలు చేసేందుకు బలమైన నాయకుడు ఉన్నప్పుడు.. అలాంటి వారు ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగిస్తారని భావించడం సహజం. దీనికి రాజకీయ యథాతథ స్థితిలో మార్పు, వేగవంతంగా నిర్ణయాలు తీసుకోవడం, పథకాల అమల్లో వేగం, రాజకీయ బుజ్జగింపులు తక్కువగా ఉండటం మొదలైనవి కారణాలు. అది “రాజకీయాలకు బయటివారు అయినప్పుడు”, “రాజకీయంగా సరైనదని భావించే వాటిని పట్టించుకోని వారు”, ‘‘డొనాల్డ్ ట్రంప్ వంటివారు ప్రెసిడెంట్ అయినప్పుడు’’ ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ప్రెసిడెంట్​ ట్రంప్ దీనికి సరిగ్గా సరిపోతారు. ట్రంప్​లా వ్యవహరించకపోతే ఎన్నికైన ఏ నేషనల్​ లీడర్​ కూడా తమ దేశ ఎజెండాను నాలుగేండ్ల స్వల్పవ్యవధిలో పూర్తి చేయలేరు. నార్మల్​ పొలిటికల్ లీడర్​లా కాకుండా ఆయన అనేక విషయాల్లో యథాతథ స్థితిని మార్చేశారు. ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బుజ్జగింపు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే “అమెరికా ఫస్ట్” నినాదంతో పనిచేసిన ట్రంప్ అభివృద్ధి అజెండాను ఆయన నుంచి ఎవరూ దూరంగా తీసుకెళ్లలేదు. ఇటీవలి కాలంలో డెమొక్రాట్లు, రిపబ్లికన్లు రాజకీయంగా చేసిన 4 తప్పిదాలను నేను ప్రస్తావించదలిచాను. ఇవి ఇకపై అమెరికా పొలిటికల్​ సినారియోను మార్చనున్నాయి. 1. పొలిటికల్​ పర్సనల్​ ఎటాక్స్ 2015లో అమెరికా రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి పొలిటికల్​ పర్సనల్​ ఎటాక్స్​ అనే కొత్త సంస్కృతిని ట్రంప్ ప్రారంభించారు. 2016 ప్రెసిడెన్షియల్​ ఎన్నికల్లో ఆయన గెలిచిన తర్వాత అది అధికారికమైపోయింది. ఒకవేళ నేను గనుక ట్రంప్​కు సలహా ఇచ్చే పరిస్థితి ఉంటే, ట్రంప్​ వైట్​హౌస్​లో అడుగుపెట్టిన తొలి రోజే ఆ తరహా కోణాన్ని మానుకోవాలని సూచించే వాడిని. ఇది ఆయనను చెడ్డపేరు నుంచి తప్పించడమే కాదు 2020లో మరోసారి ఎన్నికవడం సులభమై ఉండేది. ఇదేదో నేను పునరాలోచన చేసి చెప్పడం లేదు, ఆయన పదవీ కాలంలో ఇది నా ఆలోచనల్లో ఉంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నాన్​అమెరికన్​ కమ్యూనికేషన్​ మీడియంను డెమొక్రాట్లు ఎంచుకున్నారు. ట్రంప్ విధానాన్ని ఆయనకు వ్యతిరేకంగా ఆయనపైనే అమలు చేసి దాన్ని సక్సెస్​ చేయడమే కాదు, పొలిటికల్​ యాక్సెప్టెన్సీని పొందారు. ట్రంప్ పర్సనల్​ ఎటాక్స్​ను రిపబ్లికన్ పార్టీ మందలించకుండా, తిరస్కరించకుండా ఉంటూ దాన్ని ఆమోదించింది. అమెరికా రాజకీయ మనుగడ దారుణంగా పతనమయ్యేలా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి చెందిన రెండు కీలక పార్టీలు పర్సనల్​ ఎటాక్స్​ను కలిసికట్టుగా ఆమోదించడమే కాదు దాన్ని ప్రోత్సహించాయి. ఈ కమ్యూనికేషన్ విధానం సాధారణమేనని, సోషల్​గా యాక్సెప్టెన్సీ ఉంటుందని మీడియా కూడా ప్రచారం చేసింది. అమెరికా మీడియా, జర్నలిస్టుల టీమ్స్​ రాజకీయ గమనంలో దిగువకు దిగజారిపోయి సరిదిద్దుకోలేని స్థాయికి చేరాయి. ఈ కమ్యూనికేషన్ విధానాన్ని అమెరికా రాజకీయాల్లోని రెండు పార్టీలు అంగీకరించాయి కాబట్టి పొలిటికల్​గా సరైనదనేది లేకుండా పోయింది. ఐదేండ్ల టైమ్​లోనే ప్రపంచమంతా గౌరవించే కేర్​ఫుల్​ కమ్యూనికేషన్ విధానం నుంచి నెగ్లిజెన్స్​ మీడియంలోకి అమెరికా దిగజారడం దురదృష్టకరం. 2.సోషల్​ మీడియాలో పసలేని వాదనలు మేధావులు, క్రియేటివిటీ, బిజినెస్​ ఎఫీషియెన్సీ, సోషల్​ వాల్యూస్​ కలిగిన దేశంగా ఇటీవలి వరకు అమెరికాను భావించేవారు. అందరికీ అంతరాయం లేని ఎక్స్​ప్రెషన్​ పేరుతో సోషల్ మీడియా ఇన్నాళ్లు దాచిపెట్టిన అమెరికా వికృతాన్ని అంతా బయటపెట్టింది. గుర్తింపు పొందలేకపోయిన వాళ్లు, వాగుడుకాయలు, సామాజికంగా మెచ్యూరిటీ లేనివారు, తెలివితక్కువ దద్దమ్మలందరికీ తమ మాటలు వ్యక్తం చేసేందుకు ఒక వేదిక దొరికింది. దాన్ని వారు విజయవంతంగా ఉపయోగించుకొని అందర్ని నట్టేట ముంచారు. ముఖ్యంగా మేధావులు, అందరి తరపున నిలిచేవారు, అర్థవంతమైన వ్యక్తులు, తమ వృత్తి ద్వారా నిజమైన విలువ చేకూర్చే వారి మాటలన్నీ తెలివితక్కువ దద్దమ్మల గోల ముందు వినిపించకుండా పోయాయి. ఈ మార్పును ఫేస్​బుక్, ట్విట్టర్, వాట్సప్, ఇన్​స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా తమ దేశంలోనే కాదు, తెలియకుండానే ప్రపంచమంతా వ్యాపించేలా చేసింది అమెరికా. ఈ మార్పు అనేది సోషల్​ ఎక్స్​ప్రెషన్ నాణ్యతను దెబ్బతీయడమే కాదు పొలిటికల్​ ఎక్స్​ప్రెషన్, ప్రొటెస్ట్​ ఎక్స్​ప్రెషన్​ క్వాలిటీని కోలుకోలేని రీతిలో దెబ్బకొట్టింది. జాగ్రత్తతో కూడిన ఎక్స్​ప్రెసివ్​ ఎక్స్​ప్రెషన్​ అన్నది అటు మెయిన్​స్ట్రీమ్​ మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ కనిపించకుండా పోయింది. అదే సమయంలో విద్వేషపూరితమైన ఎక్స్​ప్రెషన్లు వేగంగా ప్రపంచమంతటా వైరల్ అవుతున్నాయి.డొల్ల పోస్టులు, నిర్లక్ష్య కామెంట్లు, అవగాహన లేని ప్రకటనలు, అసమంజసమైన తీర్పులు, తిట్లు, తప్పుడు ఎక్స్​ప్రెషన్లకు దారితీస్తున్నాయి. ఎటువంటి విషయ పరిజ్ఞానం లేని చాలా మంది, తమ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలకు సంబంధం లేకున్నా, ఆ విషయంలో కనీస పరిజ్ఞానం కూడా లేకుండా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తిగత స్వరాలు, అభిప్రాయాలు భవిష్యత్ ప్రపంచాన్ని తీర్చిదిద్దితే ఆ దేశం లేదా ప్రపంచం ఒక దశాబ్ద కాలంలో ఎలా దిగజారిపోతుందో ఊహించవచ్చు. 3. హౌస్, సెనెట్​లో డిబేట్లు సరిగ్గా జరగట్లే వర్చువల్ ప్రపంచంలో చోటుచేసుకున్న చవకబారు వ్యక్తీకరణ, దిగజారుడు విలువలకు హౌస్, సెనెట్ తమ చర్చల్లో తావు ఇవ్వకుండా ఉండాల్సింది. హౌస్, సెనెట్ ప్రతినిధులు ఎలా వ్యవహరించాలనే దానిపై కనీస ఆలోచనగానీ, ఆత్మపరిశీలనగానీ చేసుకున్న దాఖలాలు లేవు. సోషల్ మీడియాలో చెలరేగిపోయేవారి దృష్టిని ఆకర్షించాలని అందరూ ప్రయత్నిస్తున్న విషయం స్పష్టమవుతోంది. విద్వేషపూరిత, అవమానకరమైన, సంచలనాత్మకమైన, దూషణలతో కూడిన ప్రకటనలే సెనెట్, హౌస్​ల్లో గొప్ప ప్రసంగాలుగా మారిపోయి వేలాది లైకులు, షేర్లకు బాటలు వేస్తున్నాయి. హౌస్, సెనెట్ నుంచి ప్రసారమవుతున్న ప్రసంగాలు దీనికి ఉదాహరణలు. చాలా ప్రసంగాల తీరు, నాణ్యత ఇప్పటికే అడుగంటిపోయాయి. హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి ఆదర్శప్రాయమైన ప్రవర్తనతో ఉదాహరణగా నిలిచి నాయకత్వం వహించాల్సింది. కానీ, ఆమె నిరసనకారులను “దేశీయ ఉగ్రవాదులు”గా అమెరికా అధ్యక్షుడిని “అమెరికాకు ప్రస్తుతం స్పష్టమైన ముప్పు”గా అభివర్ణించారు. హౌస్ ఆఫ్ రెప్రంజెటేటివ్స్ నుంచి ఇంత కంటే దిగుజారుడు ప్రసంగాలు ఉండవు. అనవసరమైన, అనాగరికరమైన, వీధుల్లో మాట్లాడుకునే చవకబారు మాటలు ఒక గొప్ప ప్రజాస్వామ్యదేశపు స్పీకర్ నోటి నుంచి వచ్చాయి. ఇది అమెరికా భవిష్యత్ రాజకీయ ముఖచిత్రాన్ని స్పష్టం చేస్తోంది. ఉమ్మడి సమావేశంలో దేశం ఎన్నుకున్న అధ్యక్షుడి ప్రసంగ పత్రాలను చించేసిన ఆమె తీరును యావత్తు జాతి దిగ్భ్రాంతిగా చూస్తూ ఉండిపోయింది. సంచలనాలు, మూర్ఖత్వం ఇటీవలి కాలంలో పేట్రేగిపోయాయి. ప్రజాస్వామ్య గణతంత్ర దేశాల్లో ఆరాధనీయ స్థలాలుగా నిలిచే అమెరికా చట్టసభల్లోనూ ఇది చొచ్చుకుపోయింది. 4. రెండు పార్టీల వ్యవస్థకు త్వరలో ముగింపు! 25వ సవరణను చేపట్టేందుకు సాగుతున్న ప్రయత్నాలకు వైస్​ ప్రెసిడెంట్​ మైక్ పెన్స్ వంతపాడకపోవడం, ట్రంప్​ను పదవీచ్యుతుడిని చేసేందుకు రెండోసారి అభిశంసన తీర్మానం తెచ్చే ప్రయత్నాలు అమెరికా ప్రజల్లో చీలిక తేవడమే కాదు వారిని కచ్చితంగా బాధిస్తాయి. కొంత మంది కీలక రిపబ్లికన్ల సహకారంతో ట్రంప్​ను అవమానించేందుకు డెమొక్రాట్లు చేస్తున్న పన్నాగం స్పష్టంగా కనిపిస్తోంది. ట్రంప్​ను పదవీచ్యుతుడిని చేయడం తథ్యం. డెమొక్రాట్ల అధీనంలో ఉన్న సెనేట్ ఈ నెలలోనే ట్రంప్​పై అభిశంసన పెట్టి భవిష్యత్​లో ఆయన అధ్యక్షుడిగా పోటీ చేయకుండా శిక్షించనుంది. ఇవన్నీ ట్రంప్​పై వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలుగా కనిపిస్తున్నాయి. ఈ కుతంత్రాల కారణంగా “అధ్యక్ష అభిశంసన” అనేది దాని పవిత్రతను, తీవ్రతను కోల్పోయింది. అది ఇప్పుడు ఒక రాజకీయ ఆయుధంగా కనిపిస్తోంది. హౌస్, సెనేట్ లేదా రెండు ఎవరి అధీనంలో ఉంటే వారు ఎప్పుడైనా ఆ ఆయుధాన్ని ఇక ఉపయోగించవచ్చు. రెండు పార్టీల సమతుల్యతను దెబ్బతీసేలా ట్రంప్ కొత్త పార్టీని ఏర్పాటు చేసే అవకాశం ఉందని నాకనిపిస్తోంది. వచ్చే వారం రోజుల్లో ట్రంప్​ను దెబ్బతీసేందుకు సాగుతున్న చర్యల తీవ్రతను బట్టి కొత్త పార్టీ ఏర్పాటు మొదలుపెట్టవచ్చు. – కె.కృష్ణసాగర్​రావు, ఆర్గనైజేషనల్​ స్ట్రాటజిస్ట్.