అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలకు ఇంకా ఏడాది గడువుంది. రెండోసారి నెగ్గడానికి ట్రంప్ ఇప్పటినుంచే ఎన్నో ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నారు. ఎక్కడో తూర్పు యూరోప్ లో ఉండే ఉక్రెయిన్ కు అమెరికా ఎన్నికలకు ఒక విచిత్రమైన లింక్ కలిపారు. డైరెక్ట్ గా ట్రంపే జోక్యం చేసుకోవడంతో ఈ ఇష్యూ అమెరికా ప్రజలందరి నోళ్లల్లో నలుగుతోంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో మేజర్ రోల్ పోషించింది కొన్ని ఫోన్ కాల్స్. ఈ ఫోన్ కాల్స్ కథేమిటో తెలుసుకోవాలంటే ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లాల్సిందే.
పాలిటిక్స్ అంటేనే అంత. తాము గెలవాలంటే ఇంకొకరిని టార్గెట్ చేయాలి. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అదే చేస్తున్నారు. దాదాపుగా నాలుగేళ్ల క్రితం జరిగినట్లు చెబుతున్న ఒక వ్యవహారాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చారు. అప్పట్లో అమెరికా వైస్ప్రెసిడెంటయిన జో బిడెన్ వచ్చే ఏడాది జరిగే ప్రెసిడెంట్ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ కేండిడేట్ కాబోతున్నారు. ఇదింకా ప్రిలిమినరీ దశలోనే ఉన్నప్పటికీ దాదాపుగా జో బిడెన్‌కి టికెట్ దక్కడం ఖాయంగా అమెరికన్లందరూ భావిస్తున్నారు. ఈ ప్రాసెస్ నడుస్తుండగానే… ట్రంప్ ఒక ఆకాశరామన్న ఫోన్‌కాల్‌తో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇంతకీ ఏమిటా ఫోన్ కాల్? జో బిడెన్ కొడుకు హంటర్ బిడెన్‌కి ఉక్రెయిన్‌లో బిజినెస్ వ్యవహారాలున్నాయి. ఈ లావాదేవీల్లో ఎన్నో అక్రమాలు జరిగాయని, వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న రోజుల్లో బిడెన్ తన కొడుక్కి అండగా నిలబడ్డాడని అమెరికా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఒకరికి ఎవరో ఫోన్ చేశారట! దీనిపై దర్యాప్తు జరిపించాల్సిందిగా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీకి ఈ ఏడాది జులై 25న ఫోన్ చేసి ట్రంప్ చెప్పారట. ప్రస్తుతం అమెరికాలో దుమారం రేపుతున్నది ఈ ఇష్యూనే. వచ్చే ఎన్నికల్లో లాభం పొందడానికే ఉక్రెయిన్ ప్రెసిడెంట్‌కి ట్రంప్ ఫోన్ చేశారని డెమొక్రాట్లు ఆరోపిస్తున్నారు.
జో బిడెన్‌పై అసలు ఆరోపణలేంటి?
2016లో జో బిడెన్ అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు అప్పటి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ పెట్రో పోరోషెంకోతో వాళ్ల దేశంలో సాగుతున్న అవినీతి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఉక్రెయిన్‌లో అవినీతికి ఎండ్ కార్డ్ వేయాలంటే చేయాల్సిన అనేక పనులనుకూడా బిడెన్ ప్రస్తావించారు. వీటిలో ఒక పని ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అయితే, బిడెన్ కొడుకు హంటర్ బోర్డు డైరెక్టర్‌గా ఉన్న ‘బురిస్మా హోల్డింగ్స్’ అనే ఆయిల్ కంపెనీకి సంబంధించి కొన్ని ఆరోపణలున్నాయి. వీటిపై దర్యాప్తు జరిపే కమిషన్‌కు షోకిన్ అనే అధికారి చీఫ్‌గా ఉన్నారు. జో బిడెన్ చేసిన సూచనల్లో షోకిన్‌ను పక్కన పెట్టే అంశం కూడా ఉంది. దీనిలో బిడెన్ ఇంట్రెస్ట్ ఏమిటంటే…. తన కొడుకు హంటర్‌పై ఈగ వాలకుండా చూసుకోవడమే! దీంతో ఈ విషయాన్నే ట్రంప్ పట్టుకున్నారు. హంటర్ చేసిన అక్రమాలు బయటపడకుండా ఉండటానికే అనేక అంశాల్లో , షోకిన్ అనే అధికారిని పక్కన పెట్టడం కూడా ఉందన్నది ట్రంప్ అనుమానం. వైస్ ప్రెసిడెంట్ హోదాను అడ్డం పెట్టుకుని కొడుకును రక్షించుకోవడానికి బిడెన్ ప్రయత్నించాడన్నది ట్రంప్ వాదనగా కనిపిస్తోంది. దీనినే ఇప్పుడు మెయిన్ ఇష్యూ చేస్తున్నారు.
ఫోన్ కాల్ వివరాలు బయటపెట్టండి
తన కుటుంబం సెంటర్‌గా నడుస్తోన్న గొడవపై ప్రస్తుతం డెమొక్రటిక్ పార్టీ నేత జో బిడెన్ నోరు మెదిపారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్‌తో జరిపిన ఫోన్ సంభాషణల ట్రాన్స్క్రిప్ట్ను పూర్తిగా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి అమెరికా ప్రజలకు అన్ని వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. డెమొక్రటిక్ పార్టీ లీడర్లను టార్గెట్‌గా చేసుకుని అవాస్తవాలు ప్రచారం చేయడాన్ని మానుకోవాలని ట్రంప్ అధికార యంత్రాంగాన్ని కోరారు.