
- అమెరికాను నాశనం చేయొద్దు
- 50 రాష్ట్రాల్లో ‘హ్యాండ్స్ ఆఫ్’ పేరుతో ఆందోళనలు
- ట్రంప్ గో బ్యాక్ అంటూ నినాదాలు.. ఎలాన్ మస్క్ పైనా ఫైర్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా వేలాది మంది అమెరికన్లు వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ట్రంప్ వైఖరిపై మండిపడుతున్నారు. కొత్త టారిఫ్‌లు ప్రకటించిన తర్వాత ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. ‘ట్రంప్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేస్తున్నారు.
దేశాన్ని నాశనం చేయొద్దని కోరుతున్నారు. అధ్యక్షుడి ఏకపక్ష నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అవుతున్నదని మండిపడ్తున్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరగడానికి దారితీస్తున్నాయని, వాణిజ్య యుద్ధాలను తీవ్రతరం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘హ్యాండ్స్ ఆఫ్’ పేరుతో 50 రాష్ట్రాల్లో పెద్దఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు.
వాషింగ్టన్, న్యూయార్క్, హూస్టన్, ఫ్లోరిడా, కొలరాడో, లాస్ ఏంజెల్స్, చికాగో, ఫిలడెల్ఫియాతో పాటు మన్హట్టన్లో నిరసనకారులు భారీ ర్యాలీలు నిర్వహించారు. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అంటే ఇదేనా? అని నిలదీస్తున్నారు.
ఈయూ క్యాపిటల్స్‌లోనూ ఆందోళనలు
యూరోపియన్ యూనియన్ క్యాపిటల్స్‌లోనూ ప్రజలు నిరసన తెలియజేశారు. అసలు అమెరికాలో ఏం జరుగుతున్నదని? నిలదీశారు. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ట్రంప్ వైఖరి కారణంగా ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంటున్నదని మండిపడ్డారు.
అధ్యక్షుడు రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించాడని, అతను ఒక వెర్రోడు అంటూ 70 ఏండ్ల వృద్ధురాలు ఫైర్ అయింది. అటు మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అమెరికన్లను ఇబ్బందులకు గురి చేసేలా ఉన్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘మస్క్ వాజ్ నాట్ ఎలెక్టెడ్’ వంటి నినాదాలతో స్టేట్ క్యాపిటల్ భవనాలు, ఫెడరల్ ఆఫీసుల వద్ద పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.
వాషింగ్టన్ నేషనల్ మాల్ వద్ద భారీ నిరసన
ప్రభుత్వ ఉద్యోగులను తొలగించడంపైనా నిరసనకారులు మండిపడ్డారు. ఖర్చులు తగ్గించాలనే ఆలోచనతో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈమేరకు వాషింగ్టన్‌లోని నలుమూల నుంచి నిరసనకారులు నేషనల్ మాల్ వద్దకు చేరుకుని భారీ నిరసన ప్రదర్శించారు. న్యూ హ్యాంప్‌షైర్ నుంచి కూడా బస్సులు, వ్యాన్లలో వందలాది మంది వాషింగ్టన్ చేరుకుని ట్రంప్ వైఖరిపై ఆందోళన చేపట్టారు. ట్రంప్ వైఖరి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ మిత్రులను కోల్పోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.