ట్రంప్ మరో బాంబ్..స్టీల్, అల్యూమినియంపై 25 శాతం టారిఫ్​లు

ట్రంప్ మరో బాంబ్..స్టీల్, అల్యూమినియంపై 25 శాతం టారిఫ్​లు
  • ప్రకటించిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్
  • కెనడా, మెక్సికో, బ్రెజిల్​పై భారీగా ఎఫెక్ట్ 
  • చైనా, ఇండియాపై స్వల్ప ప్రభావం

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో టారిఫ్ బాంబు పేల్చారు. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25% టారిఫ్​లు విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ టారిఫ్​లు బుధవారం నుంచే అమలులోకి వస్తాయని స్పష్టంచేశారు. ట్రంప్ తాజా నిర్ణయంతో కెనడా, మెక్సికో, బ్రెజిల్ దేశాలపై గణనీయమైన ప్రభావం పడనుంది. అమెరికాలో స్టాక్ మార్కెట్ సంక్షోభం, ఆర్థిక వృద్ధి మందగమనం నెలకొన్నా.. ఈ దిగుమతి సుంకాలతో అమెరికన్ ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలు పెరుగుతాయని ట్రంప్ వెల్లడించారు. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై ట్రంప్ ఫస్ట్ టర్మ్​లో 2018లోనే 10% టారిఫ్​లు విధించి ట్రేడ్ వార్​కు తెరతీశారు. తాజాగా ఈ టారిఫ్​లను మరో 15% పెంచారు.  మంగళవారం వివిధ కంపెనీల సీఈవోలతో ఆయన మాట్లాడుతూ.. టారిఫ్​లు పెంచడం వల్ల అమెరికన్ ఫ్యాక్టరీల్లో కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సాహకంగా ఉంటుందన్నారు. కాగా, కెనడా నుంచి దిగుమతి అయ్యే స్టీల్, అల్యూమినియంపై 50% టారిఫ్ లు విధించాలని ట్రంప్ మంగళవారం భావించారు. కానీ అమెరికాలోని మిషిగన్, మిన్నెసోటా, న్యూయార్క్ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న విద్యుత్ పై సర్ చార్జీ అమలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్ ప్రీమియర్ డగ్ ఫోర్డ్ ప్రకటించారు. దీంతో ట్రంప్ కూడా టారిఫ్​లను 25 శాతానికే పరిమితం చేస్తున్నట్టు ప్రకటించారు.  

భారత్​పై ప్రభావం స్వల్పమే.. 

స్టీల్, అల్యూమినియం 25% టారిఫ్​లతో ఇండియా, చైనాపై ప్రభావం స్వల్పమేనని నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది చైనా నుంచి 550 మిలియన్ డాలర్లు, భారత్ నుంచి 450 మిలియన్ డాలర్ల విలువైన స్టీల్ అల్యూమినియం మాత్రమే ఎక్స్ పోర్ట్ అయ్యాయి. వీటిపై టారిఫ్​ల పెంపుతో చైనా, భారత్ పై స్వల్ప ప్రభావమే పడనుందని చెప్తున్నారు.