పొడవాటి గడ్డం.. ప్రస్తుతం యూత్ లో ఫుల్ ట్రెండ్ నడుస్తుంది. స్టైల్ గా ఉంటుందని పొడవాటి గడ్డాలు పెంచుకుంటున్నారు. అంతేకాకుండా దీనికోసం నో షేవ్ నవంబర్ అంటూ ప్రత్యేక రోజులు కూడా ఉన్నాయి. అయితే, ఆ ట్రెండ్ తోనే అమెరికాలోని జోయల్ స్ట్రాసర్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాధించాడు. అయితే, అతను సాధించింది గడ్డం పెంచుకున్నందుకు కాదు. ఆ గడ్డానికి క్రిస్మస్ ఆభరణాలతో (బబుల్స్) అలంకరించుకున్నందుకు.
ఇడాహోకు చెందిన జోయల్ కు ప్రతీ ఏడాది క్రిస్మస్ సందర్భంగా తన గడ్డాన్ని బబుల్స్ తో అలంకరించుకుంటాడు. అలా గత 4 ఏండ్లుగా గడ్డాన్ని డెకరేట్ చేస్తూ.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాధించుకుంటూ, తన రికార్డ్ ను తానే బద్దలు కొట్టుకుంటున్నాడు. ఇలా జోయల్ 2019లో 302 బబుల్స్ తో గిన్నిస్ లో మొదటిసారి చోటు సంపాధించాడు. తర్వాత నుంచి 2020లో 542 బబుల్స్ తో, 2021లో 686 బబుల్స్ తో గడ్డాన్ని అలంకరించుకొని రికార్డులు క్రియేట్ చేశాడు. తాజాగా 710 బబుల్స్ తో తన రికార్డ్ ను తానే బద్దలు కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.