Bajaj Pulsar: హాట్ కేకుల్లా పల్సర్ బైక్స్ సేల్స్.. ఏప్రిల్ స్పెషల్ డిస్కౌంట్స్ అందుకే..

Bajaj Pulsar: హాట్ కేకుల్లా పల్సర్ బైక్స్ సేల్స్.. ఏప్రిల్ స్పెషల్ డిస్కౌంట్స్ అందుకే..

Bajaj Offers: భారతదేశంలో పురాతన టూవీలర్ తయారీ సంస్థల్లో బజాజ్ ఆటో ఒకటి. బజాజ్ వ్యాపారాన్ని మలుపుతిప్పిన వాహనం అంటే 2001లో విడుదలైన పల్సర్ మోడల్ అనే చెప్పుకోవాలి. బజాజ్ చేతక్ తర్వాత అంత ప్రజాధరణ అందుకున్న మోడల్ ఇది. ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లో కలిపి పల్సర్ అమ్మకాలు 2 కోట్ల మైలురాయిని అధిగమించాయని కంపెనీ తాజాగా ప్రకటించింది. 

కంపెనీ పల్సర్ సిరీస్ విక్రయాలు కోటి మార్కును చేరుకోవటానికి దాదాపు 17 సంవత్సరాల సుదీర్ఘకాలం పట్టింది. కానీ 2019 నుంచి 2025లోని ప్రస్తుతం కాలం అంటే దాదాపు 6 ఏళ్ల కాలంలోనే కంపెనీ వేగంగా మరో కోటి వాహనాలను అమ్మి 2 కోట్ల పల్సర్ బైక్స్ విక్రయాలను చేరుకుంది. ప్రస్తుతం పల్సర్ బైక్స్ ఇండియాలోనే కాకుండా లాటిన్ అమెరికా, సౌత్ ఈస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్ వ్యాప్తంగా 20 దేశాల్లో మంచి ఆదరణను పొందుతోంది. భారీ మైలురాయిని అందుకున్న నేపథ్యంలో కంపెనీ కస్టమర్లకు ఏప్రిల్ నెలలో వివిధ మోడళ్లపై గరిష్ఠంగా రూ.7వేల 300 వరకు తగ్గింపును అందించాలని నిర్ణయించింది.

ALSO READ | దుమ్మురేపుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఏకంగా 10 లక్షల యూనిట్స్ సేల్, ఎందుకింత క్రేజ్..

దిల్లీ ఎక్స్ షోరూమ్ ధరల ప్రకారం కంపెనీ ఏఏ మోడళ్లపై ఎంతెంత రేటు తగ్గింపును అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Pulsar 125 Neon – ధర రూ.84వేల 493 (తగ్గింపు రూ.1వెయ్యి184)
  • Pulsar 125 Carbon Fibre – ధర రూ.91వేల 610 (తగ్గింపు రూ.2 వేలు)
  • Pulsar 150 Single Disc – ధర రూ. 1లక్ష12 వేల 838 (తగ్గింపు రూ.3 వేలు)
  • Pulsar 150 Twin Disc – ధర రూ.1లక్ష19వేల 923 (తగ్గింపు రూ.3 వేలు)
  • Pulsar N160 USD – ధర రూ.1లక్ష 36వేల 992 (తగ్గింపు రూ.5వేల 811)
  • Pulsar 220F – ఈ మోడల్ వాహనంపై మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మాత్రమే రూ.7వేల 379 తగ్గింపును కంపెనీ అందిస్తోంది. 

ఇదే సమయంలో పల్సర్ NS125 బేస్, NS125 ABS, N160 TD సింగిల్ సీట్ మోడళ్లపై అదనపు డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉంచినట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం పల్సర్ బైక్స్ 125సీసీ నుంచి 400సీసీ వరకు వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. అలాగే క్లాసిక్, NS, N కేటగిరీల కింద విక్రయించబడుతున్నాయి. బైకింగ్ సెగ్మెంట్లో పల్సర్ రైడర్ల నుంచి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించటమే భారీ అమ్మకాలకు కారణంగా తెలుస్తోంది. 

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కంటే ఎక్కువ దేశాల్లో ప్రస్తుతం బజాజ్ గ్రూప్ తన మోటార్ సైకిళ్లను విక్రయిస్తోందని బజాజ్ ఆటో లిమిటెడ్ మోటార్‌సైకిల్ బిజినెస్ యూనిట్ అధ్యక్షుడు సారంగ్ కనడే అన్నారు. ఈ క్రమంలో 2 కోట్ల పల్సర్ బైక్స్ విక్రయ మైలురాయిని చేరుకోవటం తమ కస్టమర్ల నమ్మకం, లాయర్టీకి నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. అందుకే ఈ విజయాన్ని పంచుకునేందుకు ఏప్రిల్ నెలలో కొనుగోలు చేసే బైక్ లవర్స్ కి వివిధ పల్సర్ మోడళ్లపై ప్రత్యేక తగ్గింపులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.