Bengaluru: ప్రమాదంలో బెంగళూరు టెక్కీలు.. ఇప్పుడు ఇల్లు కొనొచ్చా లేక ఆగాలా..?

Bengaluru: ప్రమాదంలో బెంగళూరు టెక్కీలు.. ఇప్పుడు ఇల్లు కొనొచ్చా లేక ఆగాలా..?

Bengaluru Real Estate: భారత సిలికాన్ వ్యాలీగా గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరు నగరం అనేక స్టార్టప్, టెక్ కంపెనీలకు నిలయంగా మారింది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో టెక్కీలు, గ్రాడ్యుయేట్లు తమ ఉపాధి అవకాశాల కోసం నగరానికి వెళుతున్నారు. దీంతో నగరంలో రోజురోజుకూ రద్దీ పెరుగుతూనే ఉంది. అయితే అధిక అద్దెలతో చాలా మంది సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవటంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. అయితే దీనికి ఇది సరైన సమయమేనా అనే అంశాన్ని ముందుగా పరిశీలించటం ముఖ్యం.

బెంగళూరులో దాదాపు సగం వేతనం ఇంటి అద్దె రూపంలో ఖాళీ అవుతుంది. ఈ క్రమంలో ఒక వ్యక్తి బెంగళూరులో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ కొనుగోలు మంచిదా లేక మరో ఆరు నెలలు ఆగాలా అని చేసిన పరిశీలకు నెటిజన్ల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఏఐ విస్తృత వ్యాప్తితో పాటు నెమ్మదించిన జాబ్ మార్కెట్, టెక్ రంగంలో కొనసాగుతున్న లేఆఫ్స్ టెక్కీలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వాస్తవానికి బెంగళూరుకు వెన్నుముక ఐటీ రంగం కావటంతో ఇక్కడి నుంచి అనేక ప్రాంతాలకు కంపెనీలు తరలిపోవటం కూడా ఇల్లు కొనుగోలుదారులు పరిగణలోకి తీసుకోవాల్సిన విషయాల్లో ఒకటిగా ఉంది.

ఐటీ రంగం ప్రస్తుతం అనేక ప్రతికూలతలను ఎదుర్కొంటున్న తరుణంలో బెంగళూరులో ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటున్న వ్యక్తులు మరికొంత సమయం వేచి ఉండటం ఉత్తమంగా తెలుస్తోంది. ఏఐ వల్ల మందగిస్తు్న్న ఐటీ జాబ్ మార్కెట్ త్వరలోనే రియల్టీ రంగాన్ని కుదిపేస్తుందని, ఇది ధరల తగ్గుదలకు దారితీస్తుందని వారు చెబుతున్నారు. అలాగే చాలా మంది రియల్టీ నిపుణులు కూడా ప్రస్తుతం బెంగళూరు మార్కెట్ అధిక ధరల శ్రేణిని కలిగి ఉందని అంటున్నారు. అందువల్ల త్వరలోనే రేట్ల కరెక్షన్ ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో రియల్టీ పెట్టుబడులు లేదా ఇల్లు కొనుగోలు వంటి చర్యలను తాత్కాలికంగా స్వల్ప కాలంలో వాయిదా వేయటం కలిసొచ్చే అంశంగా వారు చెబుతున్నారు. కేవలం ఐటీ రంగం ఒక్కటే కాకుండా ఏఐ ఇతర రంగాలపై కూడా తన ప్రభావాన్ని చూపించటం ప్రజలు ఉపాధి కోల్పోవటానికి కారణంగా మారుతోంది. ఇలాంటి సమయంలో రుణాలపై హై టికెట్ రుణాలైన హోమ్ లోన్స్ తీసుకోవటం తర్వాత చెల్లింపులకు ఇబ్బందులను కలిగించవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read :- ఢిల్లీలో ప్రభుత్వ స్కూళ్లలో ఉచిత JEE, NEET కోచింగ్

అలాగే ఉద్యోగాలు కోల్పోయిన వ్యక్తులు వేరే నగరాలకు లేదా వారి స్వస్థలాలకు వెళ్లటం మెుదలుపెడితే రానున్న కాలంలో బెంగళూరు హౌసింగ్ డిమాండ్ కూడా పడిపోతుందని రియల్టీ నిపుణులు చెబుతున్నారు. అనరాక్ సంస్థ నివేదిక ప్రకారం త్రిసంద్ర మెయిన్ రోడ్ ఏరియాలో చదరపు అడుగు స్థలం ధర 2024లో రూ.8వేల900గా ఉంది. అలాగే అద్దెలు 62 శాతం పెరిగాయి. ఇక నో బ్రోకర్ నివేదిక ప్రకారం రూ.40-80 లక్షల మధ్య రేటులోని హౌసింగ్ ప్రాజెక్టులు దాదాపు 2024లో 29 శాతం తగ్గిపోయాయని తేలింది. ప్రజలు సైతం సౌకర్యవంతమైన లగ్జరీ హౌసింగ్ కి మారుతున్న వేళ రియల్టీ సంస్థలు సైతం డిమాండ్ కి అనుగుణంగా కొత్త ప్రాజెక్టులను లాంచ్ చేస్తున్నాయి. 

బెంగళూరు ఓనర్స్ తీరు ఇలా..
బెంగళూరులో ప్రస్తుతం కొందరు ఇంటి యజమానులు తాము ఇళ్లు అవసరమైనతే ఖాళీగా అయినా పెట్టుకుంటాం కానీ తక్కువ అద్దెలకు ఇవ్వబోయేది తేదని చెప్పటం ఆశ్చర్యా్న్ని కలిగిస్తోంది. అయితే మరో పక్క మరికొందరు మాత్రం గతంలో కంటే ఇంటి అద్దెలను స్వల్పంగా తగ్గిస్తూ అద్దెకు వచ్చేవారికి సహకరిస్తున్నారు. పైగా బెంగళూరులో ఇల్లు అద్దెకు తీసుకోవాలంటే కనీసం లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేయాల్సి రావటం కూడా పెద్ద సమస్యగా మారుతోంది. అయితే కర్ణాటక ప్రభుత్వం మాత్రం ఇంటి అద్దెలను నియంత్రించటానికి పెద్దగా చర్యలు తీసుకోకపోవటం ఉపాధి కోసం వివిధ నగరాల నుంచి వచ్చే వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఏఐ ఎఫెక్ట్ వల్ల జేపీ నగర్, బన్షంకరీ వంటి ప్రాంతాల్లో అద్దెలు 5 నుంచి 10 శాతం తగ్గుదలను చూశాయి.