
Bengaluru News: బెంగళూరు అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ఐటీ పరిశ్రమ. పైగా కొన్నేళ్లుగా స్టార్టప్స్ బూమ్ కొనసాగటంతో నగరానికి వస్తున్న ప్రజల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో నగరంలో రద్దీ కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది. కానీ హైదరాబాద్, చెన్నై వంటి ఇతర నగరాల నుంచి పెరుగుతున్న పోటీతో చాలా ఐటీ కంపెనీలు, జీసీసీలు ప్రస్తుతం బెంగళూరును వీడుతున్నాయి. నగరంలో పెరిగిపోతున్న రద్దీతో పాటు అధిక అద్దెలు, నీటి కొరత వంటి సమస్యలు ప్రజలను ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే.
ఇక అసలు విషయానికి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది ఐటీ పరిశ్రమలో ఉపాధి అవకాశాలను అన్వేషిస్తూ బెంగళూరుకు వెళుతుంటారని తెలిసిందే. కానీ కొన్ని నెలలుగా ఐటీ రంగంలో కొనసాగుతున్న మందగమనంతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్థానిక ప్రజలకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలను కల్పించాలని చూస్తున్న వేళ టెక్ రంగంలో కొంద మందగమనం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు చాలా కంపెనీలు ప్రస్తుతం ఏఐ ఆధారిత టూల్స్, మోడళ్లను ప్రవేశపెడుతూ ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. ప్రధానంగా కోడింగ్ వంటి ఉద్యోగాలను ఏఐ తగ్గిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటికే అమెరికా వంటి దేశాల్లో ఏఐ టెక్ రంగంలో ఉద్యోగాలను ఆక్రమిస్తుండగా.. తర్వాత ఇది ఇండియా వంటి ఐటీ సేవల రంగంపై ఆధారపడిన దేశాల్లో ఉపాధి అవకాశాలపై తీవ్రంగా ప్రభావం చూపవచ్చని పలు నివేదికలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలా మంది ఐటీ నిపుణులు కాస్ట్ కట్టింగ్ ప్రణాళికల కింద తమ ఉద్యోగాలను కోల్పోవటంతో బెంగళూరులో తెలుగు రాష్ట్రాల వ్యాపారులు కూడా ఆందోళన చెందుతున్నారు.
►ALSO READ | హల్దీరామ్‌లో టెమాసెక్‌కు వాటా
చాలా చోట్ల ఇంటి యజమానులు ఖాళీగా అయినా ఉంచుకుంటున్నారు కానీ తక్కువ అద్దెలకు ఇళ్లను రెంట్ కి ఇవ్వకపోవటంతో చాలా మంది తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో చాలా మంది పీజీ హాస్టల్స్ నిర్వాహకులు సైతం ఆందోళన చెందుతున్నారు. బెంగళూరు నగరంలో ప్రధానంగా ఐటీ కంపెనీలకు నిలయంగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతం చుట్టుపక్కల ఇళ్లను అద్దెకు తీసుకునేవారు లేకపోవటంతో టూలెట్స్ పెరిగిపోతున్నాయని వెల్లడైంది.
ఐటీ ఉద్యోగాల కోసం వచ్చే యువత కొత్తగా రాకపోవటంతో హాస్టళ్లు ఖాళీగా ఉండటం నిర్వహణను భారంగా చేస్తున్నాయని అక్కడి పీజీ ఓనర్లు చెబుతున్నారు. ఈ ఐటీ కంపెనీల చుట్టుపక్కల ప్రాంతాల్లో మూడు బెడ్ రూమ్స్ ఉండే ఇళ్ల అద్దె దాదాపు రూ.25 వేలుగా ఉండేది. కానీ ప్రస్తుతం ఇవి ఖాళీగా ఉంటూ యజమానులకు అద్దె ఆదాయం లేకుండా పడి ఉుంటున్నాయని తేలింది. గతంలో కరోనా తర్వాత ఉద్యోగులను ఆఫీసులకు తిరిగి రావాలని ఐటీ కంపెనీలు ఆదేశించగా తిరిగి గాడినపడ్డ పీజీలు ప్రస్తుతం తిరిగి ఎదురుదెబ్బలు చూస్తున్నాయి. దాదాపు ఇళ్లు అద్దెకు ఇచ్చే యజమానుల పరిస్థితి కూడా ప్రస్తుతం ఇలాగే ఉందని తెలుస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం గడచిన ఏడాది కాలంలో 87 కంపెనీలు 23వేల 504 మంది ఉద్యోగులను బెంగళూరులో తొలగించటం వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోంది.