
లక్నో: ప్రధాని మోడీ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయ సందర్శన దేశ రాజకీయాల్లో చర్చనీయాశంగా మారింది. బీజేపీ రాజ్యాంగం ప్రకారం 2025 సెప్టెంబర్లో మోడీ ప్రధాని పదవి నుంచి దిగిపోవచ్చని.. ఈ విషయం చెప్పేందుకు ఆయన ఆర్ఎస్ఎస్ పెద్దలను కలిశారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్‌లో కొత్త చర్చకు తెరలేపాయి. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ మోడీ వారసుడిని ఎంపిక చేసే పనిలో నిమగ్నమైందన్న రౌత్ కామెంట్స్ బీజేపీ వర్గా్ల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి. నిజంగానే మోడీ ప్రత్యమ్నాయానికి ఆర్ఎస్ఎస్ కసరత్తు మొదలుపెట్టింది..? అదే నిజం అయితే ఎవరికీ అవకాశం దక్కుతుంది..? అన్న చర్చలు ఊపందుకున్నాయి.
మోడీ తర్వాత ప్రధాని రేసులో యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ ముందు వరుసలో ఉన్నట్లు కమలం పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ప్రధాని పదవి.. తన రాజకీయ భవిస్యత్పై సీఎం యోగి ఆదిత్య నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు పార్టీ హై కమాండ్ నుంచి అనుకూల సంకేతాలు ఉన్నాయా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. రాజకీయాలు నాకు పూర్తి కాల ఉద్యోగం కాదని.. నేను ఒక యోగినని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రస్తుతం నేను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని. పార్టీ హైకమాండ్ నన్ను ఉత్తరప్రదేశ్ ప్రజల కోసం ఇక్కడ ఉంచింది. రాజకీయాలు నాకు పూర్తి ఉద్యోగం కాదు. ప్రస్తుతం నేను ఇక్కడ పనిచేస్తున్నా. దీనికి కూడా ఒక కాలపరిమితి ఉంటుంది. కానీ వాస్తవానికి నేను ఒక యోగిని" అని పేర్కొన్నారు.
అలాగే బీజేపీ హై కమాండ్‌తో తనకు విభేదాలు ఉన్నట్లు జరుగుతోన్న ప్రచారంపైన యోగి క్లారిటీ ఇచ్చారు. బీజేపీ పెద్దలతో తనకు ఎలాంటి విభేదాలు లేవని.. అదంతా ఫేక్ ప్రచారమని కొట్టిపారేశారు. పార్టీ అధిష్టానమే నాకు సీఎం పదవి ఇచ్చింది. అలాంటప్పుడు కేంద్ర నాయకులతో నాకు విభేదాలు ఉంటే నేను ఇక్కడ సీఎం పదవిలో ఎలా ఉంటానని ప్రశ్నించారు.
కాగా, ప్రధాని మోడీ పీఎం హోదాలో తొలిసారి 2025, మార్చి 30న మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్‌కు ఆయన నివాళులర్పించారు. ఆర్ఎస్ఎస్ భారతదేశ సాంస్కృతిక, సైద్ధాంతిక వారసత్వాన్ని సూచించే మహా వృక్షమని అభివర్ణించారు. అలాగే.. నాగ్‌పూర్‌లో దివంగత RSS చీఫ్ మాధవరావు సదాశివరావు గోల్వాల్కర్ అలియాస్ గురూజీ జ్ఞాపకార్థం స్థాపించిన మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్‌కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు.
ALSO READ : త్వరలో మోదీ రిటైర్కాబోతున్నారు! శివసేన లీడర్ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
ఈ క్రమంలో ప్రధాని మోడీ ఆర్ఎస్ఎస్ కార్యాలయ పర్యటనపై ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం కీలక నేత, ఎంపీ సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. ‘‘బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగ ప్రకారం 75 ఏళ్లకు పదవి విరమణ చేయాలి. ఈ సెప్టెంబర్లో ప్రధాని మోడీకి 75 ఏండ్లు పూర్తి అవుతాయి. ఈ క్రమంలోనే సెప్టెంబర్లో ప్రధాని పదవి నుంచి తప్పుకోవడం గురించి చర్చించేందుకే ప్రధాని మోడీ ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లి ఉండొచ్చని.. త్వరలోనే మోడీ వారసుడిని ఆర్ఎస్ఎస్ ఎంపిక చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి’’ అని సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.