కరోనా ఎఫెక్ట్ : పుణెలో రాత్రి కర్ఫ్యూ..బార్లు, హోటళ్లు బంద్

కరోనా ఎఫెక్ట్ : పుణెలో రాత్రి కర్ఫ్యూ..బార్లు, హోటళ్లు బంద్

మహారాష్ట్రలో రోజు రోజుకూ కరోనా వ్యాప్తి కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే వైరస్‌ కేసులు ఎక్కువగా ఉన్న నాగ్‌పూర్‌లో లాక్‌డౌన్‌ విధించిన సర్కారు.. లేటెస్టుగా పుణెలో రాత్రిపూట కర్ఫ్యూ విధించేందుకు సిద్ధమవుతోంది. రేపటి(శనివారం, ఏప్రిల్-3) నుంచి వారం రోజుల పాటు సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 6గంటల వరకు 12 గంటల పాటు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పుణె డివిజినల్‌ కమిషనర్‌ సౌరభ్‌ రావ్‌ ప్రకటించారు. 

ఏప్రిల్‌ 3 నుంచి పుణె వ్యాప్తంగా బార్లు, హోటళ్లు, రెస్టారంట్లు, సినిమా థియేటర్లు మూతపడనున్నాయి. ప్రార్థనా మందిరాలు పూర్తిగా మూసివేస్తున్నట్లు చెప్పారు సౌరభ్‌ రావ్‌. అయితే.. హోం డెలివరీలకు అనుమతి ఉంటుందని.. అంత్యక్రియలు, వివాహాలు మినహా ఎలాంటి ఫంక్షన్లను అనుమతించబోమని స్పష్టం చేశారు. అంత్యక్రియల్లో 20 మంది, మ్యారేజీలకు 50 మందికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఏప్రిల్‌ 9వ తేదీ వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి కర్ఫ్యూ పై నిర్ణయం తీసుకుంటామన్నారు పుణె డివిజినల్ కమిషనర్.