తాడేపల్లి: వైసీపీ అధినేత జగన్ సెప్టెంబర్ 28న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. 27న రాత్రి తిరుమలకు జగన్ చేరుకోనున్నారు. 28న ఉదయం స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించనున్నారు. చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు.. సెప్టెంబర్ 28, శనివారం రోజున ఏపీలోని ఆలయాల్లో పూజల్లో పాల్గొనాలని వైఎస్ జగన్ ఇప్పటికే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
అందులో భాగంగానే.. ఏ తిరుమల లడ్డూ ప్రసాదం చుట్టూ వివాదం నడుస్తుందో.. అదే తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలని జగన్ నిర్ణయించారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం విదితమే. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ నెయ్యి వాడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయ రగడకు కారణమయ్యాయి.
ALSO READ | తిరుమల లడ్డూ వివాదం: అన్ని ఆలయాల్లో పూజలకు జగన్ పిలుపు
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు కట్టుకథలు చెప్తున్నారని వైసీపీ చీఫ్ జగన్ ఆరోపించారు. ‘‘నెయ్యికి బదులు జంతు కొవ్వు వాడారని దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారు. సీఎంగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం కరెక్టేనా? దశాబ్దాల నుంచి ఒకే విధానంలో లడ్డూ తయారీ సామాగ్రి కొనుగోలు చేస్తున్నాం. ప్రతి ట్యాంకర్ ఎన్‌ఏబీఎల్ సర్టిఫికెట్ తీసుకుని రావాలి. ఆ తర్వాత టీటీడీ మూడు శాంపిల్స్‌ను తీసుకుని టెస్ట్ చేస్తుంది. ఈ టెస్ట్‌లు పాసైతేనే ఆ సామాగ్రిని టీటీడీ అనుమతిస్తుంది. ఈ విధానమంతా దశాబ్దాల నుంచి జరుగుతుంది’’ అని జగన్ చెప్పిన విషయం విదితమే. జులై 12న శాంపిల్స్ తీసుకున్నారని, ఆ సమయంలో సీఎంగా ఉన్నది చంద్రబాబే అని తెలిపారు. టీటీడీ పరువును బజారు కీడుస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
హిందువులకు వేంకటేశ్వరస్వామి కలియుగ దేవుడని, ఇలా లడ్డూను అపవిత్రం చేస్తారని ఎవరూ ఊహించలేదని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘‘ఎవరైనా శ్రీవారికి అపచారం తలపెడితే.. వచ్చే జన్మలో కాదు, ఈ జన్మలోనే శిక్షిస్తాడని అందరూ నమ్ముతారు. అపచారానికి పాల్పడ్డ వారిన ఏం చేయాలో అర్థం కావడం లేదు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని చంద్రబాబు అన్నారు.