అమీన్​పూర్​ మున్సిపల్​ చైర్మన్​అక్రమ నిర్మాణాల కూల్చివేత

  • సర్వే నంబర్​ 462లో భారీ షెడ్ల తొలగింపు
  • స్పోర్ట్స్​ఆడిటోరియం, ఇతర నిర్మాణాలు నేలమట్టం

రామచంద్రాపురం (అమీన్​పూర్), వెలుగు: సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మున్సిపల్  చైర్మన్  పాండురంగా రెడ్డికి సంబంధించిన అక్రమ కట్టడాలను అధికారు లు కూల్చివేశారు. అమీన్​పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 462లో ఉన్న ప్రభుత్వ భూములను పాండురంగా రెడ్డి ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని ఆ నిర్మాణాలను అధికారులు మంగళవారం కూల్చివేశారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో బంధంకొమ్ము ఏరియాలోని ప్రభుత్వ భూమిలో భారీ షెడ్లు, స్పోర్ట్స్  ఆడిటోరియం, ఇతర నిర్మాణాలను నేలమట్టం చేశారు. రెవెన్యూ, మున్సిపల్​ ఆధ్వర్యంలో రెండు బృందాలు అక్కడికి చేరుకున్నాయి.

విషయం తెలుసుకున్న చైర్మన్​ పాండురంగారెడ్డి తన కొడుకు, అనుచరులతో కలిసి అక్కడికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు యత్నించారు. పట్టా భూమిలోనే నిర్మాణాలు చేశామని తహసీల్దార్ రాధతో చైర్మన్  గొడవకు దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి చైర్మన్​ను, అతని అనుచరులను అక్కడి నుంచి పంపించారు. దీంతో అధికారులు ఆ కట్టడాలను నేలమట్టం చేశారు.

అన్ని రికార్డులు నిర్ధారించాకే కూల్చివేతలు చేపట్టామని తహసీల్దార్  రాధ స్పష్టం చేశారు. అలాగే, అమీన్​పూర్​ మండల పరిధిలోని ఐలాపూర్​ తండాలో కూడా అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. సర్వే నంబర్​ 119, 221లోని దాదాపు 20 ఎకరాల ప్రభుత్వ స్థలంలో పలు నిర్మాణాలు, హద్దు రాళ్లను జేసీబీల సాయంతో తొలగించారు.