Amir Hussain Lone: రెండు చేతులు లేకున్నా గొప్ప ఆల్‌రౌండర్.. భళా అనిపిస్తున్న జమ్మూ క్రికెటర్

Amir Hussain Lone: రెండు చేతులు లేకున్నా గొప్ప ఆల్‌రౌండర్.. భళా అనిపిస్తున్న జమ్మూ క్రికెటర్

శరీరంలో అన్ని అవయవాలు సరిగా ఉన్నా.. పని చేయడానికి బద్ధకించే మనుషులు ఈ సమాజంలో ఎందరో ఉన్నారు. తిని, పడుకోవడానికి మాత్రమే ఇంటికొస్తూ మిగిలిన సమయంలో రోడ్లపై బలాదూర్ తిరుగుతూ కాలక్షేపం చేస్తుంటారు. అలాంటి వారందరికి కళ్లు తెరిపించే ఓ క్రికెటర్ స్ఫూర్తిదాయక ప్రయాణమిది. ఎనిమిదేళ్ల పసిప్రాయంలో విధి తన రెండు చేతులను తీసుకుపోయినా.. అతని సంకల్పం ముందు వైకల్యం కూడా చిన్నబోయింది.

క్రికెట్ అంటే ఎనలేని మక్కువ

జమ్ము కశ్మీర్, బిజ్‌బెహరాలోని వాఘామా గ్రామానికి చెందిన అమీర్ హుస్సేన్‌కు క్రికెట్ అంటే ఎనలేని మక్కువ. ఆ మక్కువతోనే.. అతను ఎప్పుడూ బ్యాట్, బాల్‌తోనే స్నేహం చేసేవాడు. అలాంటి సమయంలో అతని జీవితంలో చోటుచేసుకున్న ఓ అనూహ్య సంఘటన తన జీవితాన్ని తలకిందులు చేసింది. తనకు ఎనిమిదేళ్ల వయస్సు ఉన్నప్పుడు అమీర్ తన తల్లిదండ్రుల బ్యాండ్సా మిల్లులో జరిగిన ఓ ప్రమాదంలో తన రెండు చేతులు కోల్పోయాడు. ఆ ఘటనతో వారి కుటుంబంలో ఆనందమనేది పూర్తిగా దూరమయ్యింది. చుట్టూ ఉన్న పిల్లలు ఆటలాడుతుంటే.. తన బిడ్డ వారిని చూస్తూ ఆనందపడతుంటే.. అమీర్ తల్లి మనసు తల్లిడిల్లిపోయేది. రెండు చేతులు లేని తన బిడ్డ వందేళ్ల జీవితాన్ని ఎలా నెట్టుకొస్తాడా అని అతని తల్లిదండ్రులు దిగులుపడని రోజు లేదు.

ఒంటి కాలిపై నిల్చొని బౌలింగ్

అప్పుడే అమీర్ తన సంకల్పానికి వైకల్యం అడ్డు కాకూడదని నిర్ణయించుకున్నాడు. చేతులు లేకపోతేనేం.. క్రికెట్ ఆడటానికి మిగిలిన అవయవాలు ఉన్నాయిగా.. అవి చాలని అడుగులు ముందుకేశాడు. ఆ నిర్ణయమే అతన్ని గొప్ప క్రికెటర్ గా ప్రపంచానికి పరిచయం చేసింది. చేతులు లేకపోయినా.. తల సాయంతో బ్యాటింగ్, కాళ్లతో బౌలింగ్ చేయగలడు అమీర్. ఒంటి కాలిపై నిల్చొని మరో కాలితో అతను బౌలింగ్ చేసే తీరు చూపరులను కూడా కంటతడి పెట్టిస్తుంది. ఇక బంతి తలకు తగలకుండా హెల్మెట్ ధరించి ఆడే ఈ రోజుల్లో మెడ సాయంతో బ్యాటింగ్ చేసే అతని ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే.

జమ్ము కశ్మీర్ కెప్టెన్

అమీర్ ధైర్యాన్ని, నైపుణ్యాన్ని గుర్తించిన అతని టీచర్.. పారా క్రికెట్ కు పరిచయం చేశాడు. అప్పటినుంచి అతని పోరాటం సాగుతూనే ఉంది. 2013 నుంచి జమ్ము కశ్మీర్ పారా క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఆ జట్టు కెప్టెన్ కూడానూ. 2018లో ముంబై వాంఖడే వేదికగా బంగ్లాదేశ్‌తో అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అక్కడ అతని బౌలింగ్ శైలి, బ్యాటింగ్ నైపుణ్యం క్రికెట్ నిపుణుల దృష్టిని ఆకర్షించింది. అతను షార్జా, దుబాయ్, నేపాల్‌ దేశాల్లో జరిగిన పలు టోర్నీల్లో పాల్గొన్నాడు. విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ తన అభిమాన క్రికెటర్లు. అతని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.