టీమిండియా మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా ప్రస్తుతం ఐపీఎల్ లో లక్నో సూపర్ జయింట్స్ తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ లో విజయవంతమైన బౌలర్లలో ఒకడిగా పేరొందిన ఈ వెటరన్ స్పిన్నర్ కు జట్టులో స్థానం దక్కడం లేదు. సీజన్ లో ఒకటి రెండు మ్యాచ్ లు మినహాయిస్తే పెద్దగా అవకాశం దక్కడం లేదు. అయితే తమ జట్టు కెప్టెన్సీపై అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ స్థానంలో మరొకరిని లక్నో కెప్టెన్ గా ప్రకటించవచ్చని మిశ్రా అభిప్రాయపడ్డాడు.
పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మిశ్రాకు.. రాహుల్ వచ్చే సీజన్‌లో లక్నో కెప్టెన్ గా కొనసాగుతాడా అనే ప్రశ్న ఎదురైంది. దీనికి మిశ్రా స్పందిస్తూ "లక్నో ప్లే ఆఫ్స్ చేరనందుకు గోయెంకా నిరాశ చెందాడు. మేము ఈ సీజన్ లో వరుసగా రెండు మ్యాచ్ లను ఘోరంగా ఓడిపోయాం. కేకేఆర్ పై 90 పరుగుల తేడాతో.. సన్ రైజర్స్ పై 10 వికెట్ల తేడాతో ఓడిపోయాం. ఈ దశలో డబ్బులు పెట్టిన ఫ్రాంచైజీకు కోపం రావడం సహజం. లక్నో వచ్చే సీజన్ లో మంచి కెప్టెన్ కోసం చూస్తుంది". అని మిశ్రా అన్నారు. 2022 నుంచి రాహుల్ లక్నో సూపర్ జయింట్స్ కెప్టెన్ గా జట్టును నడిపిస్తున్నాడు.
ALSO READ | IND vs SL 2024: శ్రీలంకతో వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్య దూరం.. కారణమిదే..?
2022, 2023 సీజన్ లో ప్లే ఆఫ్ కు చేరిన లక్నో సూపర్ జయింట్స్ 2024 సీజన్ లో 7 వ స్థానంతో సరిపెట్టుకుంది. ఐపీఎల్ 2024 లో మే 9వ తేదీ బుధవారం సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ పై లక్నో సూపర్ జేయింట్స్ 10 వికెట్ల తేడాతో ఘోరంగా పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ తర్వాత లక్నో యజమాని సంజీవ్ గోయెంకా, కెప్టెన్ కెఎల్ రాహుల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాచ్ లో ఓటమి అనంతరం రాహుల్ వద్దకు వచ్చిన సంజీవ్.. ఏం ఆటయ్యా అది.. బౌలర్లు, ఫీల్డర్లను సరిగా ఉపయోగించుకోకుండా చెత్త కెప్టెన్సీ చేస్తున్నావ్ అంటూ తిడుతున్నట్లు.. గ్రౌండ్ లోనే అతనిపై అసహనంతో ఊగిపోయాడు.