పారిస్ ఒలింపిక్స్ హాకీలో టీమిండియా అదరగొడుతుంది. అంచనాలను అందుకుంటూ సెమీ ఫైనల్ కు దూసుకెళ్లింది. క్వార్టర్‌ఫైనల్‌లో గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్ ను డ్రా చేసుకున్న టీమిండియా షూటౌట్ లో 4-2 తేడాతో గెలిచి సెమీస్ కు అర్హత సాధించింది. దీంతో పతాకానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది. మంగళవారం (ఆగస్ట్ 6) జర్మనీతో సెమీ ఫైనల్ సమరం జరగనుంది. ఈ కీలక మ్యాచ్ కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కీలక ప్లేయర్ డిఫెండర్ అమిత్ రోహిదాస్ ఈ మ్యాచ్ కు దూరం కానున్నాడు.
"ఆగస్టు 4న ఇండియా వర్సెస్ గ్రేట్ బ్రిటన్ మ్యాచ్ లో ఎఫ్‌ఐహెచ్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అమిత్ రోహిదాస్‌ను ఒక మ్యాచ్ సస్పెండ్ చేశారు" అని ఎఫ్‌ఐహెచ్ అధికారిక ప్రకటన పేర్కొంది. గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన పిచ్‌లో రోహిదాస్ ప్రత్యర్థి ఆటగాడిపై అనుకోకుండా అతని స్టిక్ కొట్టిన కారణంగా అతనికి రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపించేశారు. అమిత్ రోహిదాస్ అందుబాటులో లేకపోవడంతో భారత్ స్క్వాడ్ లో ప్రస్తుతం 15 మంది ఉన్నారు.
ఆదివారం అత్యంత హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో ఇండియా షూటౌట్‌లో 4–2తో గ్రేట్ బ్రిటన్‌ను ఓడించింది. వరుసగా రెండో ఒలింపిక్స్‌లో మెడల్ సాధించేందుకు చేరువైంది. ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్.. క్వార్టర్ ఫైనల్లో వరల్ నం.2 గ్రేట్ బ్రిటన్ పని పట్టింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ పోరులో గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ అత్యద్భుత నైపుణ్యా లతో షూటౌట్‌లో బ్రిటన్‌పై ఇండియా పైచేయి సాధించింది.