![అమిత్ సాద్ లైఫ్ జర్నీ.. ఫుట్‌పాత్ నుంచి తెర మీదకు](https://static.v6velugu.com/uploads/2022/10/Amit-Saad's-life-journey..-from-the-footpath-to-the-screen_kM7RJoX4Qh.jpg)
లైఫ్‌ని ఎంజాయ్ చేసే టైంలో రెస్పాన్సిబిలిటీస్ మీద పడ్డాయి. ఒక పక్క చదువుకోవాలి.. మరో పక్క పనిచేయాలి. ఆ టైంలో ఎదురైన అవమానాలు, ఆకలి బాధలు కలిసి సూసైడ్ చేసుకోమన్నాయి. ఒక్కసారిగా నడి రోడ్డులో బండి ఆగినట్టు అయింది. కానీ, ఆ నెగెటివ్ ఆలోచనలు పక్కకు నెట్టి, పాజిటివ్ ఆటిట్యూడ్‌తో ఒక్క కిక్ ఇచ్చి మళ్లీ స్టార్ట్ చేశాడు. కొన్నాళ్లకు సినిమా ఇండస్ట్రీ వైపు యూటర్న్ తీసుకున్నాడు. అంతే... టీవీ సీరియల్ నుంచి మొదలుపెట్టి, ఇప్పుడు సినిమాలు, వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న అమిత్ సాద్ లైఫ్ జర్నీ తన మాటల్లోనే...
మాది ఢిల్లీ. నేను అక్కడే పుట్టి పెరిగా. లక్నోలోని లా మార్టినేరే కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశా. ఇరవై రెండేండ్లప్పుడు యాక్టర్ అవ్వాలని ఇంట్లో నుంచి బయటికి వచ్చేశా. ముంబై వెళ్లి, యాక్టింగ్ అవకాశాల కోసం తిరిగా. ఒక రోజు టీవీ సీరియల్లో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత మరికొన్ని సీరియల్స్, రియాలిటీ షోలు, సినిమా ఛాన్స్‌లు ‘క్యూ’ కట్టాయి. అలా నా యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ అయింది. దాదాపు యాక్టర్స్ చాలామందికి ఇలాంటి స్టోరీనే ఉండి ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా యాక్టింగ్ చేయాలని ఆశ పడినా, చాలా ఫ్యామిలీల్లో ఎంకరేజ్మెంట్ ఉండదు. దాంతో వాళ్లు ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తారు.
నేనెప్పుడూ యాక్టర్ అవుతానని అనుకోలేదు. నాకు బైక్ రైడింగ్, మౌంటెన్స్ ఎక్కడం అంటే చాలా ఇష్టం. చాలాకాలం నాకు హిందీ సినిమాలు తెలియదు. నేను చూసిన మొదటి హిందీ సినిమా మణిరత్నం తీసిన ‘బాంబే’. ఆ టైంలో ఎన్.సి.సి.లో ట్రైనింగ్ తీసుకుంటున్నా. నాపాటికి నేనేదో చదువుకునేవాడ్ని. ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపేవాడ్ని. అలాంటి నేను.. యాక్టర్ అవ్వాలని ఇంట్లో నుంచి బయటకు వచ్చేయడం అప్పుడప్పుడు నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇలా చెప్తే నా జర్నీ చాలా సింపుల్‌గా అనిపించొచ్చు. కానీ.. ఈ జర్నీ వెనక చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. ఢిల్లీలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన నేను ముంబైకి వెళ్లడం ఒక అడ్వెంచర్ అయితే, వెళ్లాక ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం ఛాలెంజ్. ఈ రెండు దశలను దాటే క్రమంలో ఎన్నో నేర్చుకున్నా.
ఇంగ్లీష్ మాట్లాడుతున్నా అని..
మా నాన్న రామ్ చంద్ర దోగ్రా నేషనల్ లెవల్ హాకీ ప్లేయర్. నాకు పదహారేండ్లప్పుడు నాన్న చనిపోయాడు. దాంతో ఫ్యామిలీని నేనే చూసుకోవాల్సి వచ్చింది. చదువుకుంటూనే ఒకరి ఇంట్లో పనిచేశా. పనిచేసేటప్పుడు పాటలు పాడుతుండేవాడ్ని. అవి కూడా ఇంగ్లీష్ పాటలు. ఇంట్లో పనివాడు ఇంగ్లీష్ మాట్లాడడం, పాటలు పాడడం ఓనర్స్‌కి నచ్చలేదు. దాంతో పనిలో నుంచి తీసేశారు. ఆ టైంలో మా ఫ్యామిలీ పంజాబ్‌కి షిఫ్ట్ అయింది.
సెక్యూరిటీ గార్డుగా..
ఒక అపార్ట్మెంట్కి సెక్యూరిటీ జాబ్ కోసం ఓనర్ని అడిగాను. అప్పుడు నా వయసు ఇరవై ఒకటి. ఆయన ఒక షాపులో సెక్యూరిటీగా చెయ్యి అని చెప్పాడు. దాంతో ఢిల్లీలోని ఒక షాపింగ్ మాల్లో సెక్యూరిటీ గార్డుగా చేరా. కస్టమర్స్ వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు డోర్ ఓపెన్ చేసి, వాళ్లని ఇంగ్లీష్ లేదా హిందీలో విష్ చేసేవాడ్ని. ఆ ఏజ్‌లో చూడ్డానికి కూడా బాగుండేవాడ్ని. దాంతో నేను సెక్యూరిటీ గార్డ్ అంటే కస్టమర్స్ నమ్మేవాళ్లు కాదు. అప్పుడు అక్కడి అసిస్టెంట్ మేనేజర్ వచ్చి ‘అతను నిజంగానే గార్డ్’ అని వాళ్లతో చెప్పేవాడు.
సూసైడ్ చేసుకోవాలనుకున్నా
సెక్యూరిటీ గార్డ్ జాబ్ చేస్తున్న రోజుల్లో ఒకసారి బాగా విసుగొచ్చేసింది. ఎంతలా అంటే... బతకాలా? వద్దా? అనే ఆలోచనలు మైండ్‌లో తిరిగాయి. అలా ఆలోచిస్తున్నప్పుడు సడెన్‌గా నేను చదివిన ఒక అమ్మాయి ఇన్స్పైరింగ్ స్టోరీ కళ్లముందుకొచ్చింది. ఆమెకు చేతులు లేకపోవడంతో చాలా కుంగిపోయి, సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది. కానీ, చివర్లో ఆ ఆలోచన మానేసి, గొప్ప వ్యక్తిగా ఎదుగుతుంది. ఆ క్యారెక్టర్ నన్ను చాలా ప్రభావితం చేసింది. అయినా సరే, చనిపోదామనిపించింది.
సరిగ్గా అదే టైంలో ఇంకో విషయం జరిగింది. నేను నిల్చున్న షాప్ దగ్గరికి ఒకతను లంచ్ తీసుకుని వచ్చి, ‘ఇద్దరం కలిసి తిందాం పద’ అన్నాడు. అతనెవరో నాకు తెలియదు. కానీ, నాతో మంచిగా మాట్లాడే వాళ్లు, స్నేహం చేయాలనుకునే వాళ్లు ఉన్నారా? అని ఆశ్చర్యమేసింది. ఆ సిచ్యుయేషన్ నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజు అలా ఎందుకు జరిగిందో అర్థం కాలేదు. ఆ రోజు సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన నా మైండ్‌లో నుంచి పోయింది. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ అలాంటి ఆలోచన రాలేదు.
ఫుట్‌పాత్‌పై ఉన్న రోజులు
కొన్నిరోజులు తర్వాత నేను పనిచేస్తున్న షాపింగ్ మాల్ అసిస్టెంట్ మేనేజర్ నా రూంకి వచ్చాడు. ‘నువ్వు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నావ్. ఇదే కాలనీలో వెనక గల్లీలో ఉన్న షాప్‌లో సేల్స్‌మ్యాన్‌గా చేరు’ అని చెప్పాడు. దాంతో నేను మరుసటి రోజు సెక్యూరిటీ గార్డ్ డ్రెస్‌లోనే ఆ షాప్ దగ్గరికి వెళ్లా. ‘నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడగలను. సేల్స్‌మ్యాన్‌గా పని ఇస్తారా’ అని అడిగి, అక్కడ పనిచేశా. ఇప్పటికీ నా సినిమాలు చూసి అక్కడి కొలీగ్స్ మెసేజ్ చేస్తుంటారు. అదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్. అయితే, ఆ టైంలో తినడానికి, రూం రెంట్ కట్టుకోవడానికి డబ్బు సరిపోయేది కాదు. దానివల్ల చాలాసార్లు రూమ్‌కి వెళ్లేవాడినే కాదు. కొన్ని రాత్రులు ఢిల్లీలో ఫుట్‌పాత్‌పై పడుకున్నా. ఒకసారి మూడు రోజులు నేను ఫుట్‌పాత్‌పై ఉంటే, ఆ మూడు రోజులు నాకు ఒక ఫాస్ట్ ఫుడ్ నడిపే అతను ఫ్రీగా ఫుడ్ పెట్టాడు. నాలుగో రోజు డబ్బులు అడుగుతాడేమో, అడగకపోయినా ఫ్రీగా తినడం బాగోదులే అనుకొని అతని దగ్గరికి వెళ్లలేదు. ఏడో రోజున ఆ వీధిలో వ్యాపారం చేసేవాళ్లు నన్ను గుర్తు పట్టి, ‘నీ కోసం ఫాస్ట్ ఫుడ్ బండి అతను ఎదురుచూస్తున్నాడు’ అని చెప్పారు. డబ్బులకోసమేమో అనుకున్నా.. ఏదైతేనేం ఉన్న విషయం చెప్దామని మరుసటి రోజు అతని దగ్గరికెళ్లా. అప్పుడతను ‘నువ్వెందుకు ఇక్కడికి రావట్లేదు. రేపటి నుంచి నా బండి దగ్గరికి నువ్వే ఫస్ట్ రావాలి’ అన్నాడు. ఆ క్షణం నేను ఆశ్చర్యపోయా. నేను ఎవరో, ఏంటో తెలియదు. కానీ, అతను నాకు సాయం చేశాడు. అలా కొన్నాళ్లు ఫుట్‌పాత్‌పై గడిపా.
యాక్టర్ అవ్వాలని ఇంట్లో నుంచి వచ్చేశా
ఇంటర్ చదువుతున్నప్పుడు స్కూల్లో ప్రోగ్రామ్స్ జరిగేవి. అందులో నాటకాలు వేసేవాళ్లు. ఒక నాటకంలో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తే ‘నిన్ను పెడితే ఈ నాటకాన్ని చెడగొడతావు. నీకు యాక్టింగ్ రాదు’ అని ఆరోజు టీచర్ నన్ను రిజెక్ట్ చేసింది. ఆ మాట వల్లే నేను ముంబైకి వచ్చానేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. అయితే, బతకడానికి రకరకాల ఉద్యోగాలు చేశా తప్ప ఏదీ కూడా నా మనసుకు నచ్చి చేయలేదు. దాంతో కొన్నిరోజులు ఏం చేయాలా అని బాగా ఆలోచించా. మ్యాగజైన్లలో, యాడ్స్‌లో మోడల్స్ ఫొటోలు చూసి, నేనెందుకు ట్రై చేయకూడదు అనిపించేది. ఆ ఆలోచనతో ఒకరోజు ఇంట్లో నుంచి బయటికి వచ్చేశా. ఆ తర్వాత ముంబైలో అవకాశాల వేట మొదలైంది.
నాన్న గుర్తొచ్చాడు
1936లో బెర్లిన్ ఒలింపిక్స్ ఆధారంగా తెరకెక్కిన ‘గోల్డ్’ మూవీ 2018లో విడుదలైంది. ఆ మూవీలో నేను నా బట్టలు తీసి, రోడ్డు మీద ఉన్నవాళ్లకి దానం చేస్తా. అయితే, అది సినిమా. కానీ, మా నాన్న జీవితంలో ఎన్నోసార్లు అలా చేశారు. ఆయన బతికున్నన్నాళ్లు ఇలాంటివెన్నో చేశారని తలుచుకుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. నేను హాకీ ప్లేయర్ కావాలనేవాడు మా నాన్న. ‘గోల్డ్’లో నా పాత్ర విన్నప్పుడు నాన్నే గుర్తొచ్చాడు.
ఓటీటీలోనూ
2018లో ‘బ్రీత్ ’ అనే సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చా. తరవాత అదే సిరీస్ సీక్వెల్ ‘బ్రీత్: ఇన్ టు ది షాడోస్ ’లోనూ నటించా. 2020లో ‘అవ్రోధ్: ది సీజ్ వితిన్ ’, ‘జీత్ కి జిద్’ లో మంచి రోల్ చేశా’’.
::: ప్రజ్ఞ