
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. 45 నిమిషాలు చర్చలు జరిగిన అనంతరం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ అమిత్ షా నివాసం నుంచి బయటకు వెళ్లారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ – జనసేన పొత్తు గురించి ఈ భేటీలో చర్చించారు. సీట్ల సర్దుబాటు అంశంలో చర్చ కొనసాగిందని సమాచారం అందుతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని ఇప్పటికే పవన్ ను బీజేపీ కోరారు. అయితే తెలంగాణలో 20కి పైగా స్థానాల్లో పోటీ చేయాలని జనసేన భావిస్తోంది. ఈ నేపథ్యంలో అమిత్ షాతో పవన్ భేటీ కీలకంగా మారింది కానుంది. పవన్ తో ఈ నెల 18న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ లు భేటీ అయ్యారు. ఎన్నికల్లో జనసేన మద్దతు కోరారు. అయితే ఈ ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేయాలని తమ పార్టీ నేతలు సన్నద్దతను తెలియజేసిన విషయాన్ని వారి దృష్టికి తీసుకువచ్చారు పవన్ కళ్యాణ్. జనసేన ఏయే నియోజకవర్గాల నుండి పోటీ చేయాలనే జాబితాను కూడా జనసేన విడుదల చేసింది. అయితే పొత్తులో భాగంగా 20 స్థానాలు కేటాయించాలని అంతర్గతంగా ప్రతిపాదన పెట్టినట్లుగా తెలుస్తోంది.
అసలు వాస్తవానికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాదిరిగానే జనసేన పోటీ చేయకుండా పూర్తిగా బీజేపీకి మద్దతు ఇవ్వాలని బీజేపీ నేతలు కోరాలని భావించారు. కానీ జనసేన నేతలు ముందుగా పవన్ కళ్యాణ్ ముందు ఈ సారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేయాలని లేకుంటే పార్టీ క్యాడర్ దెబ్బతింటుందని, సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. దీంతో జనసేన ఈ సారి ఎన్నికల్లో బలంగా ఉన్న స్థానాల్లో పోటీ చేయాలన్న నిశ్చయంతో ఉంది. జనసేనతో పొత్తు, సీట్ల కేటాయింపుపై అమిత్ షా ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి.