
- సీఎం స్టాలిన్‌కు కేంద్రమంత్రి అమిత్ షా కౌంటర్
- తమిళాన్ని కేంద్రమే ప్రోత్సహిస్తున్నదని వెల్లడి
న్యూఢిల్లీ: తమిళ ప్రజలపై కేంద్రం హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తున్నదని సీఎం స్టాలిన్ చేసిన ఆరోపణలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. తమిళనాడులో ఇంజినీరింగ్, మెడికల్ కోర్సులను తమిళ భాషలోనే బోధించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన చెన్నై సమీపంలోని రాణిపేటలో నిర్వహించిన సీఐఎస్ఎఫ్ 56వ వ్యవస్థాపక దినో త్సవ వేడుకలో పాల్గొని, మాట్లాడారు." మోదీ ప్రభుత్వం స్థానిక భాషల అభివృద్ధికి కట్టుబడి ఉంది. గతంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సీఏపీఎఫ్) పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల్లో స్థానిక భాషలకు ప్రాధాన్యం లేదు.
కానీ, మోదీ సర్కార్ ఇప్పుడు తమిళం సహా అనేక భాషల్లో సీఏ పీఎఫ్ పరీక్ష రాసేలా చర్యలు తీసుకుంది. ఎనిమిదవ షెడ్యూల్‌లోని అన్ని భాషలలో నియామక పరీక్షలు రాయవచ్చు. ఇందులో తమిళం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వమే ప్రాంతీయ భాషలను ప్రోత్సహిస్తోంది. ఈ విషయంలో స్టాలిన్ సర్కార్ చాలా వెనుకబడి ఉంది. స్టాలిన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటే..ఇంజినీరింగ్, మెడికల్ కోర్సులను తమిళ భాషలో ప్రవేశపెట్టండి" అని అమిత్ షా సవాల్ విసిరారు.
త్రిభాషా విధానం మాకు అక్కర్లేదు: స్టాలిన్
మోదీ ప్రభుత్వం జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) ద్వారా తమిళులపై హిందీని బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తోందని స్టాలిన్ ఆరోపించారు. బీజేపీ విధానాలు తమిళ భాషా గుర్తింపుకు ముప్పుగా మారాయని మండిపడ్డారు.
ఎన్ఈపీ 2030 నాటికి తన లక్ష్యాలను సాధించాలని టార్గెట్ పెట్టుకుందని..అయితే, ఎన్ఈపీలోని లక్ష్యాలన్నింటిని తమిళనాడు ఇప్పటికే సాధించిందని తెలిపారు. పీహెచ్‌డీ పూర్తి చేసినవారికి ఎల్‌కేజీ విద్యార్థులు ఉపన్యాసాలు ఇచ్చినట్టుగా బీజేపీ విధానాలు ఉన్నాయని ఫైర్ అయ్యారు. తమిళనాడులో త్రిభాషా విధానం అవసరం లేదని స్టాలిన్ స్పష్టం చేశారు. ఈ కామెంట్లకే అమిత్ షా సీఐఎస్ఎఫ్ 56వ వ్యవస్థాపక దినోత్సవ వేదిక ద్వారా స్టాలిన్‌కు కౌంటర్ ఇచ్చారు.