- అంబేద్కర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలే
- ఇందుకు నిదర్శనం: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
- ఢిల్లీలోని విజయ్ చౌక్ నుంచి పార్లమెంట్ వరకు కాంగ్రెస్ ఎంపీల నిరసన ర్యాలీ
న్యూఢిల్లీ, వెలుగు: దళితులపై బీజేపీ, కేంద్ర ప్రభుత్వానికి ఉన్న కక్షను కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన మాటల్లో వ్యక్తపరిచారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చలో భాగంగా అంబేద్కర్‌పై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ కామెంట్స్‌పై అంబేద్కర్, దళిత సమాజానికి అమిత్ షా క్షమాపణ చెప్పి, తన వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఢిల్లీలోని విజయ్ చౌక్ నుంచి పార్లమెంట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.
ఈ ఆందోళనలో కాంగ్రెస్ ముఖ్య నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ , పార్టీ ఎంపీలు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. ‘‘అంబేద్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఆయన మాటలు అంబేద్కర్, యావత్ దళితులను కించపరిచేలా ఉన్నాయి.
రాజ్యాంగాన్ని మారుస్తామనే బీజేపీ ఆలోచనకు అమిత్ షా వ్యాఖ్యలు ఊతం ఇచ్చాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్నాటకకు చెందిన బీజేపీ నేత హెగ్డే ‘400 సీట్లు గెలుస్తున్నాం.. రాజ్యాంగాన్ని మారుస్తాం’అన్న కామెంట్లు నిజం కాదా?.. ఇంత జరుగుతున్నా అంబేద్కర్, దళితులకు అమిత్ షా క్షమాపణ చెప్పే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఈ వ్యవహారంలో దళితుల గౌరవాన్ని కాపాడటానికి మేం ఏ మాత్రం వెనక్కి తగ్గబోం”అని ఆయన స్పష్టం చేశారు.