
- ఆర్జేడీ పాలనంతా జంగిల్ రాజ్యమేనని విమర్శ
గోపాల్‌గంజ్: పలు రకాల స్కామ్స్‌కు పాల్పడి ఆర్జేడీ చీఫ్, బిహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ రికార్డు సృష్టించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. చివరికి పశువుల దాణాను కూడా ఆయన వదిలిపెట్టలేదని, అందులోనూ కోట్ల రూపాయలు తిన్నారని మండిపడ్డారు. దాణా స్కామ్‌తో ప్రపంచవ్యాప్తంగా బిహార్ పరువు పోయిందని అన్నారు. ఆదివారం బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో నిర్వహించిన ర్యాలీలో అమిత్ షా మాట్లాడారు. లాలూప్రసాద్ యాదవ్ అధికారంలో ఉన్నప్పుడు బిహార్‌లో జంగిల్ రాజ్ నడిచిందని ఆయన విమర్శించారు. ‘‘లాలూప్రసాద్, ఆయన భార్య రబ్రీ దేవి బిహార్‌ను 15 ఏండ్లు పాలించారు.
అప్పుడు రాష్ట్రంలో జంగిల్ రాజ్యం నడిచింది. దొంగతనాలు, దోపిడీలు, కిడ్నాప్‌లు, మర్డర్లు జరిగాయి” అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, లాలూప్రసాద్ యాదవ్ కలిసి బిహార్‌ను నాశనం చేశారని మండిపడ్డారు. ఆనాడు రాష్ట్రాన్ని పాలించిన లాలూ–రబ్రీ దేవి, కేంద్రంలో ఉన్న సోనియా–మన్మోహన్ సింగ్ సర్కార్ బిహార్ అభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు. ‘‘లాలూకు రాష్ట్రాభివృద్ధిపై పట్టింపు లేదు. ఇద్దరు కొడుకులు ఇప్పుడు సీఎం సీటు కోసం సిద్ధమవుతున్నారు. కూతురేమో పార్లమెంట్‌లో ఎంపీగా ఉన్నారు. భార్య ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. తన కుటుంబాన్ని సెట్ చేసుకోవడంలోనే లాలూ బిజీగా ఉన్నారు” అని విమర్శించారు.
బిహార్‌లో సీత ఆలయం..
బిహార్‌లో ఎన్డీయే సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాతే అభివృద్ధి జరుగుతున్నదని అమిత్ షా అన్నారు. ప్రధాని మోదీ, సీఎం నితీశ్ నేతృత్వంలోని ప్రభుత్వం అభివృద్ధిపైనే ఫోకస్ పెట్టిందని చెప్పారు. 65 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో జరగని పనులు.. పదేండ్ల మోదీ పాలనలో జరిగాయన్నారు. మళ్లీ జంగిల్ రాజ్ కావాలో? లేక అభివృద్ధి పాలన కావాలో? ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తాము మళ్లీ అధికారంలోకి వచ్చాక బిహార్‌లో వరదల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయోధ్యలో రామమందిరం నిర్మించినట్టుగానే, బిహార్‌లోని సీత జన్మస్థలంలో ఆలయం నిర్మించాలని ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు.