బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ 2G, 3G, 4G పార్టీలు : అమిత్ షా

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికీ అయోధ్య రామమందిర ఉచిత దర్శనం చేయిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. పసుపు బోర్డు కావాలని కోరుట్ల బీజేపీ అభ్యర్థి, నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్ కేంద్రంతో కోట్లాడి.. బోర్డు సాధించారని చెప్పారు. పసుపులోని ఆయుర్వేద గుణాలపై పరిశోధన చేసేందుకు రూ.200 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. దీని ద్వారా ఉత్తర తెలంగాణలోని ప్రతి పసుపు రైతు సమస్య పరిష్కారమవుతుందన్నారు. కోరుట్లలోని మెట్పల్లిలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో అమిత్ షా మాట్లాడారు. 

రాష్ట్రంలో అధికారంలోకి వస్తే  మూడు చక్కెర ఫ్యాక్టరీలను భారత ప్రభుత్వం పునరుద్ధరిస్తుందన్నారు అమిత్ షా. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే బీడీ కార్మికుల కోసం 500 బెడ్లతో నిజామాబాద్ లో అతి పెద్ద ఆస్పత్రి నిర్మిస్తామన్నారు. గల్ఫ్ కార్మికుల కోసం ఎన్ఆర్ఐ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. బీసీలను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మోసం చేశాయన్నారు. దళిత వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి.. కేసీఆర్ దళితులను మోసం చేశారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. 

మాదిగ సామాజికి వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు అమిత్ షా. ఎస్సీ వర్గీకరణ కోసం తాము చిత్తశుద్ధితో ఉన్నామని, మాదిగలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ విమోచన దినోత్సవం జరపాలా..? వద్దా..? అని ప్రశ్నించారు. నిజాం నుంచి హైదరాబాద్ కు విముక్తి కల్పించిన రోజును ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. అసదుద్దీన్ ఓవైసీ కుటుంబానికి భయపడి కేసీఆర్ విమోచన దినం జరపడం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ కారు స్టీరింగ్ కేసీఆర్, కేటీఆర్, కవిత దగ్గర లేదని, ఓవైసీ దగ్గర స్టీరింగ్ ఉందన్నారు. 

కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తామన్నారు అమిత్ షా. ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు 2జీ, 3జీ, 4జీ పార్టీలు అన్నారు. కేసీఆర్, కేటీఆర్ 2జీ (2 జనరేషన్ పార్టీలు) సలావుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దున్ ఓవైసీ 3జీ, జవహార్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ 4జీ .. ఇలాంటి కుటుంబ పార్టీలను అంతమొందించడానికి బీజేపీకి ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. కోరుట్ల నుంచి ధర్మపురి అర్వింద్ ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. తనను పెద్ద స్థానంలో ఉంచుతామని హామీ ఇచ్చారు. కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనపై కమిటీ వేసి విచారణ జరిపి.. జైలుకు పంపుతామని చెప్పారు.