ఇంఫాల్/ న్యూఢిల్లీ:మణిపూర్లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అల్లర్లకు కారణాలతో పాటు అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, కేంద్ర హోంశాఖ సెక్రటరీ గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ డేకాతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ మీటింగ్లో పాల్గొన్నారు. మైతీ వర్గీయుల అల్టిమేటం నేపథ్యంలో.. మహారాష్ట్ర ఎన్నికల ర్యాలీలను రద్దు చేసుకుని హుటాహుటిన ఆదివారమే అమిత్ షా ఢిల్లీ చేరుకుని రివ్యూ చేపట్టారు.
సోమవారం కూడా అత్యవసర సమావేశం నిర్వహించారు. పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు కొన్ని సూచనలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్లకు రక్షణ కల్పించాలని ఆదేశించారు. బీరెన్ సింగ్ పూర్వీకుల ఇంటిపై జరిగిన దాడి గురించి ఆరా తీశారు. అక్కడి పరిస్థితిని బట్టి కర్ఫ్యూ విధించాలని ఆదేశించినట్లు సమాచారం. అల్లర్లు వ్యాపించకుండా అవసరమైతే మరికొన్ని జిల్లాల్లోనూ కర్ఫ్యూ అమలు చేయాలని, ఇంటర్నెట్ సేవలను కొన్ని రోజుల పాటు షట్డౌన్ చేయాలని సూచించినట్లు తెలిసింది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ బృందం త్వరలో రాష్ట్రంలోని కీలక ప్రాంతాలను సందర్శించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఎన్డీఏ మిత్రపక్ష పార్టీల ఎమ్మెల్యేలతో సీఎం భేటీ
మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ నేతృత్వంలో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ఎమ్మెల్యేలు సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై చర్చించారు. శాంతి స్థాపనకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే అంశంపై ఎన్డీఏ మిత్రపక్ష పార్టీ నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అల్లర్లు నియంత్రించడంలో బీరెన్ సింగ్ విఫలం అయ్యారని ఆరోపిస్తూ నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) ఎన్డీఏకు తన మద్దతును ఉపసంహరించుకున్నది. ఈ అంశంపై కూడా మిగిలిన పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం చర్చించారు.