కేంద్ర మంత్రి అమిత్ షా బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి మునుగోడు సమరభేరి సభకు బయలు దేరారు. ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన సభాస్థలికి చేరుకోనున్నారు. అమిత్ షా వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నారు. మునుగోడుకు బయలుదేరే ముందు అమిత్ షా రైతు సంఘాల నేతలతో బేగంపేట ఎయిర్ పోర్టులో సమావేశమయ్యారు. రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
బావుల దగ్గర మీటర్లు పెడ్తరని సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రచారం అబద్దమని, కేవలం డిస్కంల వద్ద మాత్రమే మీటర్లు పెడతామని అమిత్ షా స్పష్టం చేసినట్లు రైతు సంఘం నేతలు చెప్పారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి సాధక బాధకాల గురించి ఆయన అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలు కాకపోవడంతో రెండేళ్లుగా పడుతున్న ఇబ్బందులను రైతులు అమిత్ షా దృష్టికి తెచ్చారు. రైతాంగం సేంద్రీయ వ్యవసాయం దిశగా వెళ్లాలని కేంద్రమంత్రి సూచించినట్లు రైతుల సంఘాల నేతలు చెప్పారు. వర్షాల కారణంగా నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని కోరామని అన్నారు.