కరీంనగర్, వరంగల్ సభలకు రాని అమిత్ షా : ఢిల్లీలో బిజీ

కరీంనగర్/వరంగల్ : భారతీయ జనతాపార్టీ ఇవాళ కరీంనగర్, వరంగల్ నగరాల్లో నిర్వహించిన లోక్ సభ ఎన్నికల విజయ సంకల్ప బహిరంగ సభలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరు కాలేదు. ఢిల్లీలో ప్రధానమంత్రితో కీలక సమావేశం ఉన్నందున ఆయన కరీంనగర్, వరంగల్ బహిరంగ సభల షెడ్యూల్ ను క్యాన్సిల్ చేసుకున్నారు.

కరీంనగర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ… వరంగల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, కరీంనగర్, పెద్దపల్లి లోక్ సభ అభ్యర్థులు బండి సంజయ్, ఎస్.కుమార్… వరంగల్ బీజేపీ అభ్యర్థి పాల్గొన్నారు.

కేటీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఎక్కడుంది: మురళీధర్ రావు

ప్రధానితో అత్యవసర సమావేశం ఉన్నందున ఇవాళ్టి సభలకు రాలేకపోతున్నానని అమిత్ షా ఫోన్ చేశారని చెప్పారు మురళీధర్ రావు. సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. భారతీయ జనతాపార్టీ మాత్రమే దేశంలో మిగిలే ఏకైక జాతీయ పార్టీ అన్నారు. దేశంలో 50 మంది దాకా ప్రధానమంత్రులు కావాలని కలలు కంటున్నారనీ.. వీళ్లంతా వారానికొకరు ప్రధానిగా ఉండాలనుకుంటున్నాని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ, బీజేపీ మాత్రమే స్థిరమైన ప్రభుత్వం నడిపించగలదన్నారు మురళీధర్ రావు.

తెలంగాణ అవతల కేసీఆర్ చెల్లని రూపాయి: లక్ష్మణ్

మోడీ చరిష్మా తట్టుకోలేకే కేసీఆర్ ముందస్తుకు వెళ్లారని లక్ష్మణ్ విమర్శించారు. కేసీఆర్ చేసిన యాగాలన్నీ ఆయన స్వార్థం కోసమే అని అన్నారు. తెలంగాణ దాటితే కేసీఆర్ చెల్లని రూపాయి అని చెప్పారు లక్ష్మణ్.