రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జరిపిన కీలక సమావేశం ముగిసింది. పలు కీలక అంశాలపై వారంతా చర్చించారు. ప్రధానంగా రాష్ట్ర బీజేపీ నేతల కోల్డ్ వార్ పైనే అమిత్ షా ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం, పత్రిక, మీడియాలో కథనాలు రావడంపై అమిత్ షా సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
పార్టీకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదని, మీడియాకు లీకులు ఇవ్వకూడదని రాష్ట్ర బీజేపీ నేతలను అమిత్ షా ఆదేశించారని తెలుస్తోంది. అంతేకాదు.. రానున్న లోక్ సభ ఎలక్షన్స్ లో తెలంగాణలో బీజేపీ పార్టీ ఎక్కువ సీట్లు సాధించేలా అందరూ కలిసికట్టుగా పని చేయాలని నేతలను ఆదేశించారు.
మరోవైపు..రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై చర్చించారని చెబుతున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అమిత్ షాకు వివరించారు. మరోవైపు.. కీలక సమావేశం ముగిసిన తర్వాత అమిత్ షాను కిషన్ రెడ్డి, బండి సంజయ్, తరుణ్ చుగ్, ఇతర నేతలు ప్రత్యేకంగా కలిశారు.