రాహుల్​ ఎన్నికల గ్యారంటీలన్నీ కోతలే : అమిత్​షా

రాహుల్​ ఎన్నికల గ్యారంటీలన్నీ కోతలే : అమిత్​షా
  • హిమాచల్, కర్నాటక, తెలంగాణ లో అమలుకాలే
  • కాంగ్రెస్ ర్యాలీల్లో పాకిస్తాన్​అనుకూల​ నినాదాలు 
  • హర్యానాలోని బాద్షాపూర్​లో ఎన్నికల ప్రచారం

చండీగఢ్: రాహుల్​ఎన్నికల గ్యారంటీలన్నీ కోతలేనని కాంగ్రెస్​అధికారంలో ఉన్న హిమాచల్​ప్రదేశ్, కర్నాటక, తెలంగాణలో నిరూపితమైందని కేంద్ర హోంమంత్రి అమిత్​షా విమర్శించారు. ఆ రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పోయారని తెలిపారు. అదే సమయంలో బీజేపీ నెరవేర్చగలిగే హామీలను మాత్రమే ఇస్తుందని స్పష్టం చేశారు. హర్యానాలోని బాద్షాపూర్​లో ఆదివారం నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో అమిత్ షా పాల్గొని, మాట్లాడారు. రాహుల్​బాబా అండ్​ కంపెనీ ఎలాంటి అభివృద్ధిని చేపట్టదని, హర్యానాలో డెవలప్​మెంట్​ కేవలం బీజేపీ డబుల్​ఇంజిన్​ సర్కారుతోనే సాధ్యమని చెప్పారు. ‘‘మేం సరిహద్దును పరిరక్షిస్తాం. రిజర్వేషన్లను కాపాడుతాం. 

ఆర్టికల్​370ని మళ్లీ తేకుండా చూస్తాం” అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న వక్ఫ్​బోర్డు చట్టంతో సమస్య ఉన్నదని, దాన్ని రాబోయే శీతాకాల పార్లమెంట్​సమావేశాల్లో సవరిస్తామని తెలిపారు. ఇందిరా గాంధీ నుంచి మన్మోహన్ ​సింగ్​ వరకూ ఏ కాంగ్రెస్ ​ప్రధాని కూడా సైనికులకు వన్ ​ర్యాంక్  వన్​ పెన్షన్  కల్పించలేకపోయారని, 2015లో నరేంద్ర మోదీ సర్కారు వన్​ ర్యాంక్ వన్​ పెన్షన్​ను తీసుకొచ్చిందని చెప్పారు. అగ్నిపథ్ ​స్కీంపై రాహుల్​ గాంధీ అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. సాయుధ దళాల్లో యువత ప్రొఫైల్​ను నిర్ధారించేందుకు ఈ స్కీమ్​ తెచ్చినట్టు చెప్పారు. పిల్లలను ఆర్మీలోకి పంపేందుకు వెనుకాడొద్దని, ప్రతి అగ్నివీర్​కు పెన్షన్​ సౌకర్యమున్న ఉద్యోగాలిస్తామని తెలిపారు. 

యువత త్యాగాలు వృథా కానివ్వం

కాంగ్రెస్​ పార్టీ ఆర్టికల్​ 370ని తిరిగి తెస్తామని అంటున్నదని అమిత్​షా మండిపడ్డారు. ‘‘జమ్మూ కాశ్మీర్​మనదా? కాదా? రాహుల్​ గాంధీ, ఆయన పార్టీ ఈ ఆర్టికల్​ను పునరుద్ధరిస్తామంటున్నారు. రాహుల్​గాంధీ, ఆయన తర్వాత మరో మూడు తరాలు వచ్చినా ఆ ఆర్టికల్​ను వెనక్కి తీసుకురాలేరు” అని అన్నారు. హర్యానా కోసం యువత ఎన్నో త్యాగాలు చేశారని చెప్పారు. వారి త్యాగాలను వృథా కానివ్వబోమని అన్నారు. 

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాబోయే ఐదేండ్లలో 5 లక్షల మందికి ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలిస్తామని చెప్పారు. కాంగ్రెస్​సభల్లో పాకిస్తాన్​అనుకూల నినాదాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇలాంటి నినాదాలు చేస్తుంటే ఎందుకు మాట్లాడడం లేదని రాహుల్​గాంధీని అమిత్​ షా ప్రశ్నించారు.