
- భారీ వర్షాల కారణంగా రాష్ట్ర పార్టీ నిర్ణయం
- 29న తెలంగాణ టూర్ యథాతథం
హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖమ్మం సభ రద్దయింది. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నామని బీజేపీ నేతలు వెల్లడించారు. ఈనెల 29న అమిత్ షా తెలంగాణ టూర్ మాత్రం యథాతథంగా జరుగనున్నది. ఆ రోజు హైదరాబాద్లో రెండు ప్రోగ్రామ్లలో అమిత్షా పాల్గొనేలా రాష్ట్ర పార్టీ ఏర్పాట్లు చేస్తున్నది. సిటీలోని ఓ ఫంక్షన్ హాల్లో వివిధ రంగాలకు చెందిన మేధావులతో అమిత్ షా భేటీ అయ్యేలా ప్లాన్ చేస్తున్నది. ఈ ప్రోగ్రామ్ ముగిసిన వెంటనే సిటీలోని మరో చోట బీజేపీ రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో అమిత్ షా పాల్గొనేలా బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
మంగళవారం సాయంత్రానికల్లా దీనిపై ఓ క్లారిటీ రానున్నది. గత నెల 15న కూడా అమిత్ షా ఖమ్మం సభ వాయిదా పడింది. అప్పుడు గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో సభను రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో వర్షాలు కురుస్తుండడంతో రెండోసారి ఖమ్మం సభ రద్దయింది. కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలోనే ఉండడంతో తెలంగాణ టూర్ పై అమిత్ షాతో మాట్లాడి ఈ రెండు ప్రోగ్రామ్ లను ఖరారు చేయనున్నారు.