- కమ్యూనిస్టుల అడ్డాపై బీజేపీ ఫోకస్
- లక్ష మంది జన సమీకరణకు లీడర్ల ప్లాన్
- నియోజకవర్గాల వారీగా ఇన్చార్జుల నియామకం
ఖమ్మం, వెలుగు: చాలా ఏండ్లుగా కమ్యూనిస్టులకు, ఆ తర్వాత కాంగ్రెస్‌కు అడ్డాగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బల ప్రదర్శనకు బీజేపీ సిద్ధమైంది. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కాలేజీ గ్రౌండ్స్‌లో 27న(ఆదివారం) కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బహిరంగ సభకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. గత రెండు నెలల్లో రెండు సార్లు మీటింగ్ తేదీ ఫిక్స్అయి, ఏర్పాట్లు చేసినా వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు నిరుత్సాహ పడ్డారు. ఎట్టకేలకు తాజాగా అమిత్ షా షెడ్యూల్ కన్ఫర్మ్ కావడంతో బీజేపీ లీడర్లు ఫుల్ జోష్ తో సభా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
ఉమ్మడి జిల్లా నుంచి లక్షకు తగ్గకుండా జన సమీకరణ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిలను నియమించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గత వారంలోనే ఖమ్మం పర్యటనకు వచ్చి అమిత్ షా మీటింగ్ సక్సెస్‌పై లీడర్లకు పలు సూచనలు చేశారు. శుక్రవారం బీజేపీ ముఖ్యనేతలు సభా ఏర్పాట్లను పరిశీలించారు.
సొంతంగా ఎదిగేందుకు..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటి నుంచి కమ్యూనిస్టులు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పట్టు నిలుపుకుంటూ వస్తున్నాయి. గత రెండు దఫాలుగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్) కు కూడా ఈ జిల్లా ప్రజలు మొన్నటి వరకు అవకాశం ఇవ్వలేదు. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ కేవలం ఒక్క అసెంబ్లీ స్థానానికే పరిమితమైంది. 2019 తర్వాత ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేల చేరికలతో టీఆర్ఎస్ బలం పెరిగింది. ఇక బీజేపీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ తరపున ఉమ్మడి జిల్లాలో ఎవరూ ప్రాతినిధ్యం వహించలేదు. రాష్ట్రవ్యాప్తంగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 7.13 శాతం ఓటింగ్ పర్సెంటీజీతో 14,43,799 ఓట్లు వచ్చాయి. ఇందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఎక్కడా నాలుగు అంకెలను దాటలేకపోయింది.
యావరేజీగా అసెంబ్లీ స్థానానికి 2 వేల కంటే తక్కువ ఓట్లు రావడంతో, ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా కనీసం రెండో స్థానంలో నిలవలేకపోయింది. తొలిసారిగా మూడేండ్ల కింద జరిగిన ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లోనే కమలం పార్టీ బోణీ కొట్టింది. ఒక కార్పొరేటర్ స్థానాన్ని గెల్చుకుంది. దీంతో ఈ పరిస్థితిని మార్చాలని గట్టిగా ప్లాన్ చేస్తోంది. ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించడం ద్వారా బలోపేతం కావాలని వేసిన ఎత్తులు వర్కవుట్ కాకపోవడంతో సొంతంగానే ఎదిగేందుకు వ్యూహాలు రచిస్తోంది. మొన్నటి వరకు బీజేపీలో చేరతామంటూ చెప్పిన లీడర్లు కూడా ఇప్పుడు ముఖం చాటేయడంతో, వారికి పార్టీ బలం తెలిసొచ్చేలా చేయాలని భావిస్తోంది.
భారీ భద్రతా ఏర్పాట్లు
అమిత్ షా మీటింగ్ సక్సెస్ కోసం ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరి చొప్పున బాధ్యులను నియమించారు. ఉమ్మడి జిల్లాలోని 47 మండలాలు, 3 మున్సిపాలిటీలతోపాటు ఖమ్మం కార్పొరేషన్ నుంచి భారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. జిల్లా ప్రజలకు భరోసా కల్పించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. ఖమ్మంలో అమిత్ షా బహిరంగ సభ జూన్ 15న జరగాల్సి ఉండగా అప్పట్లో గుజరాత్ తో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు రావడంతో వాయిదా పడింది. ఆ తర్వాత జులై 29న మీటింగ్ ప్లాన్ చేసినా, ఆ టైంలో తెలంగాణలో వరదలు, ఖమ్మంలోనూ భారీ వర్షాలతో అప్పుడు వాయిదా పడింది. ఈసారి తప్పకుండా మీటింగ్ జరుగుతుందని బీజేపీ నేతలు ధీమాగా చెప్తున్నారు.
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం ఉదయం బయల్దేరి విజయవాడ చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో భద్రాచలం వెళ్లి, రాములవారి దర్శనం తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. సాయంత్రం 5.45 తర్వాత హెలికాప్టర్లో విజయవాడ వెళ్లి, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ తిరిగి వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తొలిసారి ఖమ్మం వస్తుండడంతో మీటింగ్ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కాలేజీ గ్రౌండ్‌లోని స్టేడియం దగ్గర ఏర్పాట్లను శుక్రవారం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ పరిశీలించారు. పోలీస్ అధికారులకు పలు సూచనలిచ్చారు.