రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే టీఆర్ఎస్ ఔట్

టీఆర్ఎస్ సర్కారును కూకటివేళ్లతో పెకిలించేందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  బీజేపీలో చేరారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే.. కేసీఆర్ అవినీతి సర్కారు మాయమైపోతదని చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్ పార్టీలో చేరిన సందర్భంగా నిర్వహించిన మునుగోడు సమరభేరిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సర్థార్ వల్లభాయ్ పటేల్ చొరవతో రజాకార్ల కబంధ హస్తాల నుంచి తెలంగాణకు విముక్తి లభించిందని అన్నారు. తాము గెలిస్తే సెప్టెంబర్ లో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తానన్న కేసీఆర్ మాట తప్పారని అమిత్ షా మండిపడ్డారు. మజ్లిస్ పార్టీకి భయపడే కేసీఆర్ ఆ హామీ అమలు చేయలేదని చెప్పారు. 

బూటకపు హామీలకు పెట్టింది పేరు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ వ్యక్తి సీఎం కాబోతున్నారని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఏటా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామని చెప్పారు. కేసీఆర్ అండ్ కంపెనీ బూటకపు హామీలకు పెట్టింది పేరన్న ఆయన.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క మాటను నిలబెట్టుకోలేదని విమర్శించారు. నిరుద్యోగులకు నెలనెలా రూ.3వేల భృతి, నల్గొండ జిల్లా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.  సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ మంజూరు చేస్తున్న టాయిలెట్లు కూడా ప్రజలకు అందకుండా చేస్తున్నారని అమిత్ షా ఫైర్ అయ్యారు.

యువతకు దక్కని ఉపాధి

టీఆర్ఎస్ సర్కారు రాగానే దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని అమిత్ షా విమర్శించారు. ఆ పార్టీ మరోసారి గెలిస్తే కేసీఆర్ స్థానంలో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడే తప్ప దళితున్ని సీఎం చేయరని చెప్పారు. దళితులకు మూడెకరాలు, గిరిజనులకు ఎకరం భూమి ఇస్తామన్న హామీ ఏమైందని అన్నారు. 8ఏండ్ల పాలనలో కేవలం కేసీఆర్ కుటుంబానికి తప్ప యువతకు ఉపాధి దక్కలేదని అమిత్ షా వాపోయారు.