కేసీఆర్​ను కటకటాల్లో పెట్టి తీరుతం: అమిత్ షా

కరీంనగర్/​పెద్దపల్లి: బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు ఓటేస్తే కుటుంబ సీఎం అవుతాడని.. బీజేపీకి ఓటు వేస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతాడని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. వారసులను పదవుల్లో కూర్చోబెట్టాలని ఆరెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. కరీంనగర్​జిల్లా జమ్మికుంట, పెద్దపల్లిలో జరిగిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు.

‘కేసీఆర్​సర్కార్​పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. ఆయన్ను ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చింది. మజ్లిస్‌కు భయపడి 4 శాతం ముస్లిం రిజర్వేషన్లు చేశారు. రాష్ట్రంలో కేసీఆర్‌ను సీఎం, కేంద్రంలో రాహుల్‌ను పీఎం చేయాలని చూస్తున్నరు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటే. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నరు. బీజేపీ గెలిస్తే.. రాష్ట్రానికి బీసీ వ్యక్తి తొలి సీఎం అవుతరు. కేసీఆర్ తో పాటు అవినీతికి పాల్పడిన వారందరిన్నీ కటకటాల్లో పెట్టి తీరుతం’ అని అమిత్ షా స్పష్టంచేశారు