- పథకాల పేరుతో వేల కోట్ల లూటీ: అమిత్‌షా
- మిషన్ కాకతీయలో అవినీతిని కాగ్ బయటపెట్టింది
- రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చాక కేసీఆర్ జైలుకే
- టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ దోషులనూ వదలం
- ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి ఓబీసీ, ఎస్టీలకు ఇస్తం
- ఆర్మూర్ ఎన్నికల సభలో కేంద్రమంత్రి కామెంట్స్
నిజామాబాద్ / గండిపేట్ / మాదాపూర్, వెలుగు: పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ సర్వనాశనమైందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. స్కీమ్‌ల మాటున కొడుకు కేటీఆర్‌కు రూ.వేల కోట్లు దోచిపెట్టారని ఆరోపించారు. ‘‘మియాపూర్ భూ కుంభకోణం మొదలుకొని ఔటర్ రింగ్ రోడ్డు, కాళేశ్వరం ప్రాజెక్టు దాకా భారీగా సొమ్ము లూటీ చేశారు. పూర్తికాని మిషన్ కాకతీయ పనులకు రూ.22 వేల కోట్లు ఖర్చు చేశారనే కాగ్ నివేదిక కేసీఆర్ అవినీతిని స్పష్టం చేస్తున్నది” అని విమర్శించారు.
శుక్రవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని పెర్కిట్‌లో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా మాట్లాడారు. టీఎస్‌పీఎస్సీ ఎగ్జామ్ పేపర్లను లీక్‌చేసి, నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాటమాడుతున్నా కేసీఆర్ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో కేసీఆర్ టైమ్ ముగిసింది. ఎన్నికల ద్వారా ఆయన్ను ఇంటికి సాగనంపాలి. తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్వచ్చాక కేసీఆర్అవినీతిపై విచారణ చేయించి జైలుకు పంపుతాం. టీఎస్‌పీఎస్సీ లీకేజీ దోషులనూ వదలబోం” అని స్పష్టం చేశారు.
దృష్టి మరల్చే పాలిటిక్స్‌లో కేసీఆర్ దిట్ట
ప్రజల దృష్టిని మరల్చే రాజకీయాలు చేయడంలో కేసీఆర్ దిట్ట అని అమిత్‌షా విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఆయన్ను అసలు నమ్మొద్దని ప్రజలను కోరారు. పెట్రోల్‌పై కస్టమ్ డ్యూటీని ప్రధాని మోదీ తగ్గించారని, కేసీఆర్ మాత్రం తగ్గించకుండా ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాననే హామీని పక్కనబెట్టారన్నారు. కారు స్టీరింగ్‌ను ఎంఐఎం పార్టీ చేతిలో పెట్టారని, ఒవైసీ చెప్పుచేతల్లో గవర్నమెంట్నడుస్తున్నదని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి ఓబీసీ, ఎస్టీలకు వర్తింపజేస్తామని ప్రకటించారు. వేలం పాటలో పాల్గొనే వారికే మంత్రి పదవులు ఇస్తారని, ప్రజా నాయకులకు ఇవ్వరని ధ్వజమెత్తారు. ఆర్మూర్‌లో ఆర్టీసీ బస్ డిపో నిర్మాణానికి 1988లో కేటాయించిన ల్యాండ్‌ను తన పార్టీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి షాపింగ్సెంటర్కోసం కేసీఆర్ కట్టబెట్టారని ఫైరయ్యారు. తమ ప్రభుత్వం ఏర్పడితే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని, యువతకు 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. పసుపు బోర్డుతో రైతులకు, ఈ ప్రాంత ప్రజలకు అనేక లాభాలు కలుగబోతున్నాయని చెప్పారు. ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఆర్మూర్, బాల్కొండ బీజేపీ అభ్యర్థులు పైడి రాకేశ్‌రెడ్డి, ఏలేటి అన్నపూర్ణమ్మ పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణను 2024లో అమలు చేస్తం
తెలంగాణలో బీఆర్‌ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేతిలో ఉందని అమిత్‌షా ఆరోపించారు. బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్షాకోట్‌లో బీజేపీ రాజేంద్రనగర్ అభ్యర్థి తోకల శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా రోడ్‌షో నిర్వహించారు. అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం కోసం బీజేపీ పాటుపడుతుంది. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను చేపట్టేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. ఎస్సీ వర్గీకరణ 2024లో తప్పకుండా అమలు చేస్తాం” అని వెల్లడించారు. ఉగ్రవాదులకు అడ్డాగా రాజేంద్రనగర్ మారిందన్నారు. రాజేంద్రనగర్‌లో బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాస్‌రెడ్డికి గెలిపించాలని ప్రజలను కోరారు. శేరిలింగంపల్లి, అంబర్‌పేట్‌లోనూ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా అమిత్ షా రోడ్ షో నిర్వహించారు.
పార్టీ నేతలతో అమిత్ షా భేటీ
హైదరాబాద్, వెలుగు: బీసీ సీఎం ప్రకటన, ఎస్సీ వర్గీకరణపై మోదీ హామీపై బీజేపీ రాష్ట్ర నేతలను అమిత్‌షా ఆరా తీశారు. ఈ రెండు హామీలపై ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది? జనం అనుకున్న స్థాయిలో ఆకర్షితులయ్యారా? ఎన్నికల్లో బీజేపీకి ఎంత లాభం చేకూర్చుతాయని వివరాలను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు పార్టీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి, ఎన్నికల ఇన్చార్జ్ ప్రకాశ్ జవదేకర్, సహ ఇన్చార్జ్ సునీల్ బన్సల్, రాష్ట్ర ఇన్చార్జ్ తరుణ్ చుగ్‌తో ఆయన భేటీ అయ్యారు.
రాష్ట్రంలోని పార్టీ ప్రచార తీరు, అభ్యర్థుల గెలుపు అవకాశాలు... ఏ సీట్లలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది అనే వివరాలు షా ఆరా తీశారు. కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలన, కాంగ్రెస్ 60 ఏళ్లలో చేసిన మోసాలు, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు, విస్మరించిన తీరును జనంలోకి బాగా తీసుకెళ్లాలని రాష్ట్ర నేతలకు దిశా నిర్దేశం చేశారు.