పార్టీలో గ్రూపులు, లొల్లులు వద్దు..ఐక్యంగా ముందుకెళ్లండి : అమిత్ షా

  •     కోర్ కమిటీ మీటింగ్​లోఅమిత్ షా దిశానిర్దేశం 
  •     ఎన్నికలకు రోడ్ మ్యాప్సిద్ధం చేసుకోండి 
  •     రాష్ట్రంలో ఏ పార్టీతోనూపొత్తు ఉండదు  

హైదరాబాద్, వెలుగు : ‘‘పార్టీలో ఎలాంటి గ్రూపులు, లొల్లులు ఉండొద్దు. సీనియర్ నేతలందరూ  ఐక్యంగా ముందుకు వెళ్లాలి. పార్టీ కార్యక్రమాలపై ముఖ్య నేతలకే సీరియస్ నెస్ లేకపోతే అనుకున్న ఫలితాలు ఎలా సాధించగలం? ఎన్నికలకు ఎంతో సమయం లేదు. వెంటనే యుద్ధ రంగంలో దిగి, రాష్ట్రంలో విజయం సాధించడమే లక్ష్యంగా పని చేయండి” అని బీజేపీ సీనియర్ నేతలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేశారు. ఆదివారం ఖమ్మంలో బహిరంగ సభ తర్వాత, అక్కడే కోర్ కమిటీతో ఆయన భేటీ అయ్యారు. సాయంత్రం 5:25 నుంచి 5:55 గంటల వరకు ఈ మీటింగ్ జరిగింది. 

ఇందులో పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్ చార్జ్ ప్రకాశ్ జవదేకర్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్, రాష్ట్ర నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, సంజయ్, డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, ఇంద్రసేనా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలకు అమిత్ షా పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అవసరమైన అన్ని  సహాయ సహకారాలు అందించేందుకు హైకమాండ్ సిద్ధంగా ఉందని చెప్పారు. పార్టీ గెలుపు కోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని సూచించారు.