కేసీఆర్ కారును మోదీ గ్యారేజీలో పడేయాలన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు కాలేదన్నారు. నల్లగొండ జిల్లాలోని శివన్న గూడెం ప్రాజెక్టు, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తి చేయలేదని చెప్పారు. నల్లగొండ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 400 కోట్లు ఇచ్చిందని, ఆ నినిధులలోనూ అక్రమాలు జరిగాయన్నారు. నల్లగొండ కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు.
దళిత బంధులో 30 శాతం కమిషన్ ఎమ్మెల్యేలే తీసుకుంటున్న పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని మరోసారి హామీ ఇచ్చారు. బీసీ హక్కులను కాపాడడం కోసం బీసీ కమిషన్ ను రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేస్తామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఎంఐఎం చేతిలో కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు.
ఎంఐఎం మెప్పుకోసమే తెలంగాణలో రెండవ అధికార భాషగా ఉర్దూను ప్రవేశపెట్టారని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కుటుంబ పార్టీలే అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం కోసం సోనియాగాంధీ, తెలంగాణలో మంత్రి కేటీఆర్ ని ముఖ్యమంత్రిని చేయడం కోసం కేసీఆర్ పని చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే కుటుంబ పాలన ఉండదని, బీసీన ముఖ్యమంత్రిని చేస్తామన్నారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలు మోదీ సుపరిపాలనపై, కేసీఆర్ అవినీతిపై జరుగుతున్న ఎన్నికలు అని చెప్పారు. మియాపూర్ భూకుంభకోణం బీఆర్ఎస్ పార్టీ చేసిన కుంభకోణం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ఏ విధంగా బీఆర్ఎస్ అవినీతి చేసిందో నిరూపిస్తామన్నారు. మిషన్ కాకతీయలో 22 వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. కేసీఆర్ రోజులు దగ్గరపడ్డాయని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి కుంభకోణాలను తీసి బాధ్యులైన వాళ్లను జైలుకు పంపుతామని హెచ్చరించారు.
రాముడు జన్మించిన అయోధ్యలో రామాలయం నిర్మాణం కావాలా? వద్దా? అని ప్రశ్నించారు. జనవరి 22న అయోధ్య ఆలయం ప్రారంభమవుతుందని.. ఇక్కడి ప్రజలందరూ రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ రామ మందిర నిర్మాణానికి అడుగడుగునా అడ్డంకులు కలిగిస్తోందని ఆరోపించారు. నరేంద్ర మోదీ రామ మందిరం ఏర్పాటు కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు వస్తుందని, నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తెలంగాణ లో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని, 2024లో మోదీ సర్కార్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.