లొంగిపొండి.. లేదంటే తుదముట్టిస్తం

లొంగిపొండి.. లేదంటే తుదముట్టిస్తం
  • మావోయిస్టులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరిక 
  • త్వరలో ఆలౌట్ ఆపరేషన్ చేపడతామని వార్నింగ్ 
  • 2026 మార్చి 31 కల్లా నక్సలిజాన్ని నిర్మూలిస్తామని వెల్లడి 

న్యూఢిల్లీ: మావోయిస్టులు ఆయుధాలను వదిలిపెట్టి లొంగిపోవాలని, లేదంటే వాళ్లను తుదముట్టిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు. 2026 మార్చి 31 నాటికల్లా నక్సలిజాన్ని నిర్మూలిస్తామని చెప్పారు. దేశంలో మావోయిస్టుల హింస, భావజాలాన్ని అంతం చేయాలని ప్రధాని మోదీ నిర్ణయించుకున్నారని తెలిపారు. చత్తీస్​గఢ్​లోని 55 మంది నక్సల్ బాధితులతో శుక్రవారం ఢిల్లీలోని తన నివాసంలో అమిత్ షా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ అంతర్గత భద్రతతో పాటు నక్సలిజం మానవాళికే ముప్పుగా మారిందని అన్నారు. ‘‘హింసను వీడండి.. ఆయుధాలను వదిలి లొంగిపోండి. లేదంటే మిమ్మల్ని అంతం చేసేందుకు త్వరలోనే ఆలౌట్ ఆపరేషన్ చేపడతాం” అని మావోయిస్టులను హెచ్చరించారు. 2026 మార్చి 31 కల్లా నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. 

‘‘మా ప్రభుత్వ పాలసీలతో వామపక్ష తీవ్రవాదం ప్రస్తుతం చత్తీస్​గఢ్​లోని కొన్ని జిల్లాలకే పరిమితమైంది. నేపాల్ లోని పశుపతినాథ్ నుంచి ఏపీలోని తిరుపతి వరకు కారిడార్ ఏర్పాటు చేయాలని మావోయిస్టులు ఒకప్పుడు ప్లాన్ చేశారు. కానీ మేం దాన్ని అడ్డుకున్నాం. మావోయిస్టులకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్లలో మన భద్రతా బలగాలు అద్భుతమైన విజయాలు సాధించాయి” అని తెలిపారు. 

నక్సల్ బాధితుల కోసం పథకం..

చత్తీస్​గఢ్​లోని నక్సల్ బాధితుల సంక్షేమం కోసం మూడు నెలల్లో  పథకం తీసుకొస్తామని అమిత్ షా ప్రకటించారు. రాష్ట్ర సర్కార్ తో కలిసి అమలుచేస్తామని వెల్లడించారు. ఉపాధి కల్పించడంతో పాటు వివిధ రకాలుగా బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మావోయిస్టుల మానవ హక్కుల గురించి ప్రస్తావించేవాళ్లు, వాళ్ల వల్ల ఇబ్బందులు పడుతున్నోళ్ల మానవ హక్కుల గురించి కూడా ఆలోచించాలని సూచించారు.

కాగా, బస్తర్ శాంతి కమిటీ ఆధ్వర్యంలో నక్సల్ బాధితులు అమిత్ షాను కలిశారు. మావోయిస్టుల వల్ల తమకు జరిగిన అన్యాయాన్ని కొందరు బాధితులు వివరించారు. చత్తీస్ గఢ్ లో మావోయిస్టుల వల్ల జనం పడుతున్న ఇబ్బందులపై కమిటీ డాక్యుమెంటరీ ప్లే చేసింది. దీనిపై అమిత్ షా స్పందిస్తూ.. ‘‘వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తే.. బస్తర్ మళ్లీ అందమైన, శాంతియుతమైన, అభివృద్ధి చెందిన ప్రాంతంగా మారుతుంది” అని అన్నారు.