30 ఏళ్లుగా బీజేపీలో పనిచేస్తున్న కార్యకర్తకు సర్ ప్రైజ్

  • బేగంపేటలో కేంద్రహోంమంత్రికి వెల్కమ్ చెప్పనున్న బీజేపీ లీడర్స్
  • ఉజ్జయినీ అమ్మవారిని దర్శించుకోనున్న అమిత్ షా

హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. మునుగోడులో జరిగే సమరభేరి సభలో పాల్గొనేందుకు వస్తున్న ఆయన మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుండి నేరుగా సికింద్రాబాద్ లోని  ఉజ్జాయినీ మహాకాళి అమ్మవారి ఆలయంకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత సికింద్రాబాద్ కళాసిగూడలోనీ బీజేపీ కార్యకర్త సత్యనారాయణ (ఎస్సీ)  ఇంటికి వెళ్లనున్నారు. సుమారు అరగంట కార్యకర్త ఇంట్లోనే గడపనున్నారు. సుమారు 30 ఏళ్లుగా బీజేపీలో పని చేస్తున్న సత్యనారాయణ తన ఇంటికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా వస్తుండడంపై సంతోష వ్యక్తం చేశారు. 

షా సభతో ప్రజాసంగ్రామ యాత్రకు ఇవాళ బ్రేక్

అమిత్ షా మునుగోడులో బీజేపీ సమరభేరి సభకు హాజరవుతున్న నేపధ్యంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకు ఇవాళ బ్రేక్ ఇచ్చారు. మునుగోడు పట్టణానికి కిలోమీటరు దూరంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులందరూ తరలిరావాలన్న పిలుపు మేరకు ప్రజా సంగ్రామ యాత్రకు ఇవాళ పూర్తిగా విరామం ప్రకటించారు. నాయకులంతా బేగంపేట విమానాశ్రయంలో  కేంద్రహోంమంత్రికి స్వాగతం పలకనున్నారు. 

షా సమక్షంలో బీజేపీలో చేరనున్న రాజగోపాల్

మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. షా స్వయంగా రాజగోపాల్ రెడ్డికి కండువా వేసి చేర్చుకోనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కీలకమైన నేత అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరిక అనంతరం ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని చేర్చుకునే కార్యక్రమాలు ముమ్మరం అవుతాయని అంచనా వేస్తున్నారు. సాయంత్రం 5గంటలకు మునుగోడులో సభా వేదికపైకి చేరుకోనున్న అమిత్ షా గంటపాటు ఇక్కడే గడిపే అవకాశం ఉంది.