కేంద్రం కీలక నిర్ణయాల వెనక షా చతురత

ఎయిర్‌‌ ఇండియాలో  వాటా అమ్మాలన్న నిర్ణయం, ఆర్టికల్‌‌ 370 రద్దు,  కేరళ గవర్నర్‌‌గా ఆరిఫ్‌‌ మహమ్మద్‌‌ ఖాన్‌‌ నియామకం …ఇలా బీజేపీ సర్కార్‌‌ తీసుకున్న ముఖ్య నిర్ణయాల వెనకున్నది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌‌ షా. రెండోసారి ప్రధాని అయ్యాక నరేంద్ర మోడీ  తీసుకున్న నిర్ణయాలన్నీ సక్సెస్‌‌ కావడానికి  షా వ్యూహాలే కారణమంటారు. మోడీతో ఆయన అనుబంధం ఏళ్లనాటిది. నమ్మకమైన దోస్త్‌‌ మాత్రమేకాదు మోడీకి షా ప్రధాన వ్యూహకర్త కూడా. శరీరాలు వేరైనా ఇద్దరి మనసులు ఒక్కటే అని అంటారు.  ఆలోచన ఒకరిది. ఆచరణ ఇంకొకరిది. ఇద్దరి  మధ్య ఇగో గొడవలుండవు. గుజరాత్‌‌ నుంచి కొనసాగుతున్న వాళ్లిద్దరి అనుబంధం… మరింత బలపడుతోంది.  షా వెన్నంటి ఉండాల్సిన అవసరం మోడీకి  ఎంత ఉందో ఆయన పార్టీ ప్రెసిడెంట్‌‌గా కొనసాగించడాన్ని బట్టే తెలుస్తుంది. బీజేపీలో ‘ఒకరికి- ఒక పదవి’ అన్న విధానం అమలులో ఉన్నా షా విషయంలో మాత్రం ఆ కండిషన్‌‌  కొనసాగలేదు.  వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌గా జేపీ నడ్డాను నియమించినా ఆయన కూడా షా నిర్ణయాలను అమలుచేయాల్సిందే.  మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌‌ రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ కిందిస్థాయి నుంచి గెలుపు వ్యూహాలను రచిస్తున్నది కూడా షానే  అని పార్టీ సీనియర్‌‌ నాయకులు అంగీకరిస్తారు.  మోడీకి మరో నమ్మకమైన వ్యక్తి   అరుణ్‌‌జైట్లీ చాలా కాలంపాటు అనారోగ్యంతో బాధపడడం , ఆ తర్వాత చనిపోవడం వల్ల.. ఆయన  ప్లేస్‌‌ను కూడా అమిత్‌‌ షా భర్తీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.