ఓటర్లను అమిత్​షా బెదిరిస్తున్నారు : కాంగ్రెస్

న్యూఢిల్లీ: కర్నాటకలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వస్తే అల్లర్లు చెలరేగుతాయని హోంమంత్రి అమిత్‌‌ షా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌‌ పార్టీ తప్పుపట్టింది. అతని వ్యాఖ్యలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయని పేర్కొంది. కర్నాటకలోని బెలగావి జిల్లాలో మంగళవారం జరిగిన బహిరంగ సభలో అమిత్​షా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్ర అభివృద్ధి రివర్స్ గేర్​లో వెళ్తుందని అన్నారు. వంశపారంపర్య రాజకీయాలు తారాస్థాయికి చేరుకుంటాయని, రాష్ట్రం అల్లర్లతో అల్లాడిపోతుందని అన్నారు.

కాగా, అమిత్​షా కామెంట్లపై బుధవారం కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌‌చార్జి, జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్​ స్పందించారు. “ఇది బెదిరింపు ప్రకటన. ఇండియా తొలి హోంమంత్రి నిషేధించిన సంస్థకు విధేయత చూపిస్తున్న ఇప్పటి కేంద్ర హోంమంత్రి ఎన్నికల ప్రచారంలో బెదిరింపులకు దిగుతున్నారు. కర్నాటకలో బీజేపీ నిర్ణయాత్మకంగా ఓడిపోతోందని ఇప్పుడు తేలిపోయింది” అని ట్వీట్‌‌ చేశారు.