ఆ దాడుల వెనుకున్నది అమిత్ షానే.. కెనడా సంచలన ఆరోపణలు

ఆ దాడుల వెనుకున్నది అమిత్ షానే.. కెనడా సంచలన ఆరోపణలు
  • కేంద్ర హోంమంత్రిపై కెనడా సంచలన ఆరోపణలు
  • అమెరికాకు సమాచారం తామే లీక్ చేశామని వెల్లడి

ఒట్టావా : కెనడా మరోసారి మనదేశంపై ఆరోపణలు చేసింది. కెనడాలోని సిక్కు వేర్పాటువాదులపై జరుగుతున్న దాడుల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా హస్తం ఉందని ఆరోపించింది. కెనడాలోని సిక్కు వేర్పాటువాదులు లక్ష్యంగా దాడులు, బెదిరింపులు, హత్యలతో పాటు వాళ్ల సమాచారం సేకరించేందుకు అమిత్ షానే ఆదేశాలు ఇచ్చారని సంచలన ఆరోపణలు చేసింది. 

ఈ మేరకు కెనడా పార్లమెంట్ నేషనల్ సెక్యూరిటీ కమిటీకి ఆ దేశ డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ డేవిడ్ మోరిసన్ తెలిపారు. మంగళవారం ఆయన కమిటీ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా పేరు చెప్పారు. అయితే వీటన్నింటి వెనుక అమిత్ షా ఉన్నారనే విషయం ఎలా తెలిసిందనేది మాత్రం వెల్లడించలేదు. దాడుల వెనుక ఉన్నది ఇండియానే అని అమెరికా న్యూస్ పేపర్ వాషింగ్టన్ పోస్ట్ కు చెప్పింది తానేనని ఒప్పుకున్నారు. 

‘‘అమెరికా జర్నలిస్ట్ నాకు ఫోన్ చేశారు. దీని వెనుక ఉన్నది ఆ వ్యక్తేనా(అమిత్ షా) అని అడిగారు. దానికి నేను అవునని సమాధానం చెప్పాను” అని వివరించారు. కాగా, సిక్కు వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ఇండియా హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గతంలోనే ఆరోపించారు. కెనడాలోని ఇండియన్ హైకమిషన్ అధికారులను అనుమానితుల జాబితాలోనూ చేర్చారు. 

దీంతో రెండు దేశాల మధ్య దౌత్య యుద్ధం మొదలైంది. కెనడాలోని మన అధికారులను వెనక్కి రప్పించిన కేంద్రం.. మన దేశంలో ఉన్న కెనడా అధికారులను బహిష్కరించింది. 

బిష్ణోయ్ గ్యాంగ్ తో కలిసిందంటూ ఆరోపణ.. 

సిక్కు వేర్పాటువాదులపై జరుగుతున్న హింసాత్మక కార్యకలాపాల వెనుక ఇండియా హస్తం ఉన్నదని అమెరికాకు సమాచారం లీక్ చేసింది తామేనని కెనడా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ నథాలి డ్రౌయిన్ అంగీకరించారు. ఆమె కూడా పార్లమెంట్ కమిటీ ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. ఆ సమాచారం లీక్ చేసేందుకు తనకు ప్రధాని జస్టిన్ ట్రూడో అనుమతి అక్కర్లేదని కమిటీకి చెప్పారు. 

కమ్యూనికేషన్ స్ట్రాటజీలో భాగంగానే అమెరికాకు సమాచారం ఇచ్చామని, అందులో క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ లేదని పేర్కొన్నారు. ‘‘కెనడాలోని ఇండియన్ల సమాచారాన్ని ఆ దేశం సేకరించింది. సిక్కు వేర్పాటువాదులు లక్ష్యంగా బిష్ణోయ్ గ్యాంగ్ తో కలిసి పని చేస్తున్నది. దీనికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి. వీటిని ఇండియా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తో మేం పంచుకున్నం. 

కానీ ఆయన దాన్ని ఖండించారు. అప్పుడే మేం అన్ని విషయాలు ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించుకున్నాం” అని వెల్లడించారు.