కౌన్ బనేగా కరోడ్‌పతి 16 వ సీజన్ ప్రారంభమైంది. హోస్ట్ అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న ఈ షో గ్రాండ్ గా మొదలయింది. ఇందులో భాగంగా క్రికెట్ పై ఒక ప్రశ్న కంటెస్టెంట్ కు ఎదురైంది. క్రికెట్ ప్రేమికులు ఈ ప్రశ్నకు సమాధానం చాలా ఈజీగా చెప్పేస్తారు. తొలి 5 ప్రశ్నలకు ఈజీగా సమాధానం చెప్పి 10 వేల రూపాయలను గెలుచుకున్నాడు రాహుల్ శర్మ. 20 వేల రూపాయల ప్రశ్న అతనికి క్రికెట్ రూపంలో ఎదురైంది. 2024 మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ తరపున ఫైనల్ ఓవర్ ఎవరు వేశారు అనే ప్రశ్న అతన్ని అడిగారు.
జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ అనే నాలుగు ఆప్షన్స్ అతనికి ఇవ్వబడ్డాయి. వీటిలో ఆప్షన్ బి హార్దిక్ పాండ్య అని కంటెస్టెంట్ రాహుల్ శర్మ చెప్పాడు. సరైన సమాధానం కూడా ఇదే. దక్షిణాఫ్రికాపై జరిగిన ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చివరి ఓవర్ లో 16 పరుగులు కావాల్సిన దశలో తొలి బంతిని హార్దిక్ పాండ్య ఫుల్ టాస్ బంతిని వేశాడు. మిల్లర్ లాంగాఫ్ దిశగా భారీ షాట్ కు ప్రయత్నించి సూర్య కుమార్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. 76 పరుగులు చేసి కోహ్లీ టాప్ స్కోరర్ గా నిలిచాడు. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులకే పరిమితమైంది. ఇక ఈ గేమ్ షో విషయానికి వస్తే.. రాహుల్ శర్మ అద్భుతంగా ఆడి రూ. 12 లక్షల 50 వేల రూపాయలను ప్రశ్న వరకు వెళ్ళాడు. అయితే ఇక్కడ అతను తప్పుగా సమాధానం చెప్పడంతో రూ. 3 లక్షల 20 వేల రూపాయలకు పడిపోయి నిష్క్రమించాడు.