గ్రేటర్ వార్.. ప్రచారానికి అమిత్​ షా

గ్రేటర్ వార్.. ప్రచారానికి అమిత్​ షా
  • పొద్దున భాగ్యలక్ష్మి టెంపుల్ విజిట్ తో ప్రోగ్రాం షురూ
  • వారాసిగూడ నుంచి సీతాఫల్ మండి వరకు రోడ్ షో
  • తర్వాత బీజేపీ ఆఫీసులో లంచ్.. ముఖ్య నేతలతో సమీక్ష

హైదరాబాద్, వెలుగుగ్రేటర్  హైదరాబాద్​ ఎలక్షన్  ప్రచారం చివరిరోజు ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ తరఫున క్యాంపెయిన్ చేయనున్నారు. ఇప్పటికే వారం రోజులుగా వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, పెద్ద నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. చివరిరోజున అమిత్ షా రంగంలోకి వస్తున్నారు. ఈ మేరకు ఆయన టూర్​ షెడ్యూల్​ను పార్టీ విడుదల చేసింది.

సీనియర్​ నేతలంతా రంగంలోకి..

టీఆర్ఎస్ తో నువ్వా, నేనా అన్నట్టుగా బీజేపీ తలపడడం, కాషాయ పార్టీకి ప్రజల్లో ఆదరణ  పెరుగుతుండటంతో ఎలక్షన్  హీటెక్కింది. దీంతో బీజేపీ నేషనల్ ​ లీడర్స్​ను రంగంలోకి దింపింది. ఇప్పటికే బీజేపీ చీఫ్ నడ్డా, కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్, యూపీ సీఎం యోగి, మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్, నేషనల్ చీఫ్ స్పోక్ పర్సన్ సంబిత్ పాత్రా, బీజేవైఎం ప్రెసిడెంట్ తేజస్వి, మహిళా మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ వనతి శ్రీనివాసన్, మన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ​బండి సంజయ్, లక్ష్మణ్, అర్వింద్, వివేక్ వెంకటస్వామి, డీకే అరుణ, ఇతర నేతలు క్యాంపెయిన్​లో పాల్గొన్నారు.

పొద్దున్నుంచే..

అమిత్​షా ఆదివారం ఉదయం 10 గంటలకు స్పెషల్​ఫ్లైట్​లో బేగంపేట ఏయిర్ పోర్టుకు చేరుకుంటారు. పార్టీ ఎన్నికల ఇన్​చార్జి భూపేంద్ర యాదవ్, కె.లక్ష్మణ్​మరికొందరు రాష్ట్ర నేతలు ఆయనకు స్వాగతం పలుకుతారు. అమిత్​షా 10.45 గంటలకు ఓల్డ్ సిటీలోని భాగ్యలక్ష్మి టెంపుల్ కు చేరుకుని.. ప్రత్యేక పూజలు చేస్తారు. 11.45 గంటలకు వారసిగూడ చౌరస్తాకు చేరుకుని రోడ్​షో ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు సీతాఫల్ మండిలోని హనుమాన్ టెంపుల్ దగ్గర రోడ్​షో ముగుస్తుంది. తర్వాత అమిత్​షా నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసుకు చేరుకుని లంచ్​ చేస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3.30 గంటల వరకు రిజర్వుడు టైంగా పేర్కొన్నా.. ఆ టైమ్ లో పార్టీ ముఖ్య నేతలతో ఎన్నికలపై సమీక్షించనున్నట్టు సమాచారం. అనంతరం అమిత్​షా తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు.