- రేపు నల్గొండలో అమిత్‌షా విజయ సంకల్ప సభ
- త్వరలో మునుగోడుకు బండి సంజయ్, పవన్ కల్యాణ్!
నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు తమ పార్టీ అగ్రనేతల రాకపైనే గంపెడు ఆశలు పెట్టుకున్నారు. పెద్దలు వస్తేనే తమకు స్థానికంగా కాస్తయినా ఎన్నికల ప్రచారం జరుగుతుందని భావిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర స్థాయిలో బీజేపీ ముఖ్య నేతలు కాంగ్రెస్‌లో చేరడంతోపాటు, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న సంకేతాలతో ఉమ్మడి జిల్లాలో బీజేపీ సీనియర్లు, కార్యకర్తలు కొంత సైలెంట్ అయ్యారు. దీంతో ప్రచార బాధ్యతలను ఆ పార్టీ అగ్రనేతలే భుజానికెత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందులో భాగంగానే ప్రచారానికి హోం మంత్రి అమిత్‌షా, ఎంపీ బండి సంజయ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రానున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ–జనసేన పొత్తులో భాగంగా జిల్లాలోని కోదాడ స్థానాన్ని జనసేనకు కేటాయించింది. మిగిలిన 11 చోట్లా బీజేపీ అభ్యర్థులే పోటీచేస్తున్నారు.
హోంమంత్రి అమిత్‌షా రాక..
సకల జనుల విజయ సంకల్ప సభ పేరుతో ఇటీవల సూర్యాపేట సభలో అమిత్‌షా పాల్గొన్నారు. రెండో విడత శనివారం నల్గొండలో నిర్వహించనున్నారు. ప్రభావం చూపించే ముఖ్యమైన నియోజకవర్గాల్లో భారీ సభలు పెట్టాలని హైకమాండ్ భావించింది. నల్గొండ, మునుగోడు, సూర్యాపేట, ఆలేరు, భువనగిరిలో సామాజిక సమీకరణాల ప్రకారం అభ్యర్థులను నిలబెట్టిన పార్టీ ఈ ఎన్నిక ల్లో బోణీ కొట్టాలని భావిస్తోంది. నల్గొండ అసెంబ్లీ స్థానంలో బీసీ నేత మాదగోని శ్రీనివాస్‌గౌడ్ పోటీ చేస్తుండగా, ఆలేరులో పడాల శ్రీనివాస్, సూర్యాపేటలో మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరావు, భువనగిరిలో గూడూరు నారాయాణరెడ్డి, మునుగోడులో చల్లమల్ల కృష్ణారెడ్డి పోటీలో ఉన్నారు.
ఈ ఐదు స్థానాల్లో బీజేపీకి క్యాడర్ ఉంది. అంతేగాక బీఆర్ఎస్, కాంగ్రెస్ తరపున నిలబడిన బలమైన అభ్యర్థులతో బీజేపీ తలపడుతోంది. గత ఎన్ని కల్లో సూర్యాపేట, నల్గొండ, మునుగోడులో బీజేపీ భారీగా ఓట్లు సాధించింది. గతేడాది జరిగిన మునుగోడు బైపోల్లో ఏకంగా ఆపార్టీకి 83వేల ఓట్లు వచ్చాయి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడంలో పార్టీ జిల్లా నాయకత్వం విఫ లమవుతోంది. దీంతో జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. హైకమాండ్ ప్లాన్ ప్రకారం పార్టీ ప్రభావం చూపే నియోజ కవర్గాల్లో ముఖ్యనేతలు ఎన్నికల ప్రచారం
చేయనున్నారు.
కన్నెత్తి చూడని రాష్ట్ర నేతలు
రాష్ట్ర బీజేపీ పార్టీలో ముఖ్యనేతలు ఒక్కొక్కరు మెల్లగా జారుకోవడంతో ఆ ఎఫెక్ట్ ఉమ్మడి జిల్లా పైన తీవ్ర ప్రభావం చూపింది. రాష్ట్ర నాయకత్వంలో చోటుచేసుకున్న మార్పుల వల్ల ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన జిల్లాలోని ముఖ్యనేతలు సైతం సెలైంట్ అయ్యారు. సీనియర్ నేత గట్టు శ్రీకాంత్ రెడ్డి సైతం బీఆర్ఎస్లో చేరారు. బొబ్బా భాగ్యరెడ్డి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఈ పరిస్థి తులన్నింటినీ చక్కబెట్టి ఎమ్మెల్యే అభ్యర్థుల్లో భరోసా నింపేందుకు అగ్రనేతలు ప్రయత్నిస్తున్నారు.
ప్రభుత్వ వ్యతిరేకత ఓటు పైన ఆశలు...
ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ గాలి వీస్తోందని ప్రచారం జోరందుకున్న నేపథ్యం లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గెలుపు కోసం చెమటోడుస్తున్నారు. బీజేపీ ఎంటర్ కావడంతో జిల్లాలోని ఐదు స్థానాల్లో త్రిముఖ పోటీ ఉండనుంది. బీజేపీ మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటు పైనే ఆశలు పెట్టుకుంది.
త్వరలో మునుగోడులో భారీ సభ ప్లాన్..
మలి విడత సభ మునుగోడులో ఉంటుందని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి చెప్పారు. మునుగోడులో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ వల్ల బీజేపీకి లాభం చేకూరుతుందని భావిస్తున్నారు. ఉప ఎన్నికల నాటి ఊపును తీసుకొచ్చేందుకు త్వరలో జాతీయ నేతలు బండి సంజయ్, జన సేనా అధ్యక్షుడు పవన్ కల్యాణ్, జాతీయ అధ్యక్షుడు నడ్డాలను రప్పించి నియోజకవర్గంలో మూడు, నాలుగు చోట్ల రోడ్‌షోలు, భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని మనోహర్ రెడ్డి 'వెలుగు'కు చెప్పారు.