- హైదరాబాద్ జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల పనుల్లో లేట్
- గత నెల12నే దాటిన పనుల గడువు
- విద్యాశాఖ అధికారుల తీవ్ర నిర్లక్ష్యం
- పనులతో స్టూడెంట్స్‌కు ఇబ్బందులు
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ జిల్లాలో అమ్మ ఆదర్శ స్కూల్ పనులు లేట్ అవుతున్నాయి. స్కూళ్ల ఓపెనింగ్ కు ముందే పూర్తి చేయాలని టార్గెట్ పెట్టినా 50 శాతం పనులు కూడా కంప్లీట్ చేయలేదు. మైనర్ రిపేర్స్, కార్పెంటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ, టాయిలెట్రిపేర్వర్క్స్ వంటికి కంప్లీట్ చేయలేదు. ప్రస్తుతం నిర్మాణ, ఇతర రిపేర్ పనులు కొనసాగుతుండగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
ఫండ్స్ రిలీజ్ చేసినా..
జిల్లాలో మొత్తం 691 ప్రభుత్వ స్కూళ్లు ఉన్నాయి. ఇందులో 562 స్కూళ్లలో అమ్మ ఆదర్శ పాఠశాలల కింది ఎంపిక చేసి మౌలిక వసతులు కల్పించాలని ఆమోదించారు. ముందుగా 384 స్కూళ్లలో రూ. 30.63 కోట్లతో 1,287 పనులను చేపట్టారు. ఇప్పటివరకు 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. గ్రౌండ్రియాలిటీ మాత్రం భిన్నంగా ఉంది. చాలా స్కూళ్లలో నత్తనడకనే పనులు కొనసాగుతున్నాయి. అంబర్‌పేటలోని లకోటియా గవర్నమెంట్ స్కూల్, గోల్నాక తులసీరాం నగర్ లోని స్కూల్, రసూల్‌పురా స్కూల్ ఇలా తదితర ప్రాంతాల్లో కొత్త టాయిలెట్స్ నిర్మాణం పూర్తి చేయలేదు. కొద్దిరోజుల కిందట ఫండ్స్ రిలీజ్ అవగా, పనులు స్పీడప్ చేస్తున్నామని, ఆగస్టులోపు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ, పనులు నడుస్తున్న తీరు చూస్తుంటే.. మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. అమ్మ ఆదర్శ పాఠశాల పనులపై వెల్లడించడానికి జిల్లా విద్యాశాఖ అధికారులు నిరాకరిస్తున్నారు. దీంతో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి.
షోకాజ్ నోటీసులు ఇచ్చినా..
జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలల పనులపై కలెక్టర్ అనుదీప్ నిరంతరం జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. స్కూళ్లను సందర్శించి పనుల పురోగతిని తెలుసుకుంటున్నారు. నిర్లక్ష్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటున్నారు. కొద్ది రోజుల కిందట డీఈవో, ఇతర అధికారులకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. అయినా పనులను వేగంగా చేయడంలేదు.