అమ్మ ఆదర్శ పాఠశాల పనులు స్లో..

అమ్మ ఆదర్శ పాఠశాల పనులు స్లో..
  • హైదరాబాద్​ జిల్లాలోని 70% స్కూళ్లలో పెండింగ్
  • సరిపడా నిధులున్నా పనుల్లో కనిపించని వేగం 
  • మొన్నటితో ముగిసిన జిల్లా కలెక్టర్​ డెడ్​లైన్​
  • ట్రాన్స్ ఫర్ల బిజీలో టీచర్లు, విద్యాశాఖ ఉన్నతాధికారులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల కల్పన కోసం తీసుకొచ్చిన ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ పనులు హైదరాబాద్​జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి. స్కూళ్ల రీఓపెన్​కంటే ముందే పూర్తిచేయాలని టార్గెట్​పెట్టుకున్నప్పటికీ ఆ దిశగా పనులు జరగలేదు. సరిపడా నిధులు ఉన్నాయని, జూన్​10వ తేదీలోపు పనులు పూర్తిచేయాలని కలెక్టర్​అనుదీప్​దురిశెట్టి డెడ్​లైన్​పెట్టినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. బుధవారం నుంచి స్కూళ్లు ఓపెన్​అవుతున్నాయి. అసంపూర్తి పనులు టీచర్లు, స్టూడెంట్లకు స్వాగతం పలకనున్నాయి. 

జిల్లాలోని మొత్తం 384 స్కూళ్లలో అభివృద్ధి పనులు చేపట్టగా, ఇప్పటివరకు 30 శాతం స్కూళ్లలోనే పనులు పూర్తయ్యాయి. ఇంకా 70 శాతం స్కూళ్లలో పనులు కొనసాగుతున్నాయి. టాయిలెట్ల, వాటర్​ట్యాంకుల నిర్మాణం, పెయిటింగ్, గ్రిల్స్, ట్యాప్​లు ఏర్పాటు పనులు చేయాల్సి ఉంది. చాలా స్కూళ్లలో పనులు ఇంకా స్టార్టింగ్​స్టేజ్​లోనే ఉన్నాయి. అమ్మ ఆదర్శ పాఠశాల పనుల ఆలస్యంపై కలెక్టర్ అనుదీప్​ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసి 10 రోజులు గడుస్తున్నా.. పనుల్లో వేగం పెరగలేదనే విమర్శలు వస్తున్నాయి. 

కేవలం 108 స్కూళ్లలోనే పూర్తి

హైదరాబాద్ జిల్లాలో మొత్తం 691 గవర్నమెంట్​స్కూళ్లు ఉండగా, 562 స్కూళ్లను అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం కింద ఎంపిక చేశారు. ముందుగా 384 స్కూళ్లలో 1,287 రకాల పనులు చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఇప్పటివరకు 108 స్కూళ్లలో మాత్రమే పూర్తిస్థాయి పనులు జరిగాయి. గోల్నాక పరిధి తులసీరామ్​నగర్ గవర్నమెంట్ హైస్కూలులో బాలికల టాయిలెట్​నిర్మాణం పూర్తవడానికి మరో పది రోజులు పట్టేలా ఉంది. గ్రిల్స్, పెయింటింగ్,  మైనర్​రిపేర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల కారణంగా పనులు ఆలస్యమయ్యాయని అధికారులు చెబుతున్నారు. మరికొన్ని రోజుల్లో పూర్తిచేస్తామంటున్నారు. అయితే ప్రస్తుతం టీచర్లు, విద్యాశాఖ అధికారులు బదిలీల బిజీలో ఉన్నారు. 

కనీస వసతులు కల్పించడమే టార్గెట్

గత ప్రభుత్వం సర్కారు బడుల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ‘మన ఊరు – మన బడి’ చేపట్టింది. అయితే ఆ కార్యక్రమం ప్రారంభించిన కొన్నాళ్లకే అటకెక్కింది. కొన్ని స్కూళ్లలో మినహా ఎక్కడా పూర్తిస్థాయిలో పనులు చేయలేదు. కాంగ్రెస్​ప్రభుత్వం వచ్చీరాగానే ప్రభుత్వ స్కూళ్లను బాగుచేయాలని నిర్ణయించింది. ప్రతి స్కూలులో కనీస వసతులు కల్పించాలని ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. స్కూళ్లు రీఓపెన్​అయ్యే లోపు పనులు పూర్తిచేయాలని, స్టూడెంట్ల సంఖ్య పెంచాలని ఆదేశించింది. 

ఇందులో భాగంగా స్కూల్​బిల్డింగ్స్ కు పెయిటింగ్, గ్రిల్స్, ట్యాప్​లు, టైల్స్ ఏర్పాటుతోపాటు వాటర్​ట్యాంకులు, ట్యాయిలెట్లు నిర్మించాలని నిర్ణయించింది. కరెంట్ సదుపాయం కల్పించి లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని చెప్పింది. ఆయా పనుల కోసం హైదరాబాద్ జిల్లాకు రూ.30.63కోట్లను మంజూరు చేసింది. డ్రింకింగ్ వాటర్ కోసం రూ.లక్ష, మైనర్​ రిపేర్ల కోసం రూ.2 లక్షలు, టాయిలెట్స్​రెనోవేషన్ కోసం రూ.30 వేలు, కరెంట్​పనుల కోసం రూ.35 వేలు, బాలికలకు అదనపు టాయిలెట్స్ కోసం రూ.3.50 లక్షలు చొప్పున ఒక్కో యూనిట్​కు కేటాయించింది.