భారతీయ సమాజంలో కులవ్యవస్థ మిగిల్చిన చేదు ఫలితాల్లో అత్యంత హేయమైన విషయాలూ ఉన్నాయి. బ్రిటీష్ కాలంలో నేర ప్రవృత్తి గల తెగల చట్టం1871లో వచ్చింది. ఈ చట్టం ద్వారా కొన్ని కులాలు, తెగలపై నేరస్థులుగా ముద్రవేశారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల్లో 36 సంచారజాతులు ఉన్నాయి. నాటి నుంచి నేటివరకు ఎక్కడ చిన్న దొంగతనం జరిగినా వీళ్లనే పట్టుకొని వెళుతున్నారు. ఖాకీ సమాజం వీరిపట్ల చూపే వివక్షతను వీరిలో నేర ప్రవృత్తికి ఆజ్యం పోసినట్లైంది. ఈ కుటుంబాల్లో సుఖ సంతోషాలు లేవు. అసలు ఈ జాతుల్లో పుట్టడమే మహాపాపంగా మారింది. పుట్టిన పాపానికి నేరస్థుడనే నింద భరించాల్సివస్తోంది.
రాజుల కాలంనాడు సంచార జాతులకు ఎనలేని గౌరవం ఉండేది. రాజుల కోటలోకి మరే జాతి వెళ్ళనంతగా సంచారులు నేరుగా వెళ్లే వెసులుబాటు ఉండేది. రాజులు కథలు వినాలన్నా.. తోలుబొమ్మలాటలు చూడాలన్నా.. తన మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవాలన్నా సంచార జాతులను పిలిపించుకొని వారిచేత నాటకాలు వేయించుకొని మానసిక ఉల్లాసాన్ని పొందేవారు. ముఖ్యంగా వడ్డెరులు .. రాజులకే కాదు ఆ రాజ్యంలోని సామాన్య ప్రజల వరకు అందరికి అవసరం. ఊర్లలో ఇళ్లను కట్టాలన్నా, బావులు తవ్వాలన్నా, కాలువలు, చెరువులు, చేదబావులు తవ్వాలన్నా రాజుల నుంచి రైతుల వరకు వడ్డెరలతోనే నిర్మాణం చేయించేవారు. రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి. బ్రిటీష్ వాళ్లు వచ్చారు. సంచార జాతుల బతుకులను ముంచారు.
బ్రిటీష్ కాలంలో..
బ్రిటీష్ వారు వచ్చాక రెవెన్యూ సిస్టంలో మార్పులు వచ్చాయి. దీంతో రైతాంగం బావులను తవ్వించడం మానేశారు. ఎందుకంటే పండిన దాంట్లో కాస్తో కూస్తో ఉంటే బ్రిటీష్ వాడికి పన్నులు కట్టడానికే పోయేది. అప్పుడు వడ్డెరల చేతికి పనిలేదు. మిగిలింది ఆకలే. ఏం చేయాలి? చిన్న చిన్న దొంగతనాలు చేయడం మొదలు పెట్టారు. వారికి క్రిమినల్ ట్రైబ్స్ అని పేరు పెట్టారు. ఈ దొంగతనాలను అరికట్టేందుకు క్రిమినల్ ట్రైబ్స్ అనే ఒక యాక్ట్ ను 1871లో తీసుకొచ్చారు. ఒకరు, ఇద్దరు దొంగతనాలు చేసినా వారి కులానికి మొత్తం ఆ పేరు పడిపోయింది. ఇది భరించలేక చాలాసార్లు వడ్డెరలు బ్రిటీష్ వారిపై దాడులు చేశారు. ఆనాడు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వడ్డెరలకు ఇంతవరకూ గుర్తింపు లేదు. పోలీసులకు, వడ్డెరలకు అసలు పడేదికాదు. అలాంటి పోరాటం చేసిన వాళ్లను స్వాతంత్ర్య పోరాటం కూడా గుర్తించ లేదు. స్వాతంత్ర్యం వచ్చినంక కూడా మన పాలకులు బ్రిటీష్ వాడు చెప్పిన భావనలోనే క్రిమినల్ ట్రైబ్స్‌తో ఎడంగా ఉండాలే అనుకున్నారు. కానీ జవహర్‌లాల్ నెహ్రు ఒక్కడు మాత్రం క్రిమినల్ ట్రైబ్ అంటున్నరేంటి మనమంతా ఒక్కటేగా.. భారతీయులమేగా.. క్రిమినల్ ట్రైబ్ అనటం బాగాలేదన్నారు. గ్రామానికి బయట ఉంటారు. గ్రామంలో భాగం కాదు. కుల పంచాయితీలు వేరే. సమాజంతో సంబంధం ఉండదు. కాబట్టి ఎటూ గుర్తింపు లేని వారిగా అయ్యారు. వడ్డెర్ల చరిత్ర మొత్తం దురదృష్టకరమే. బ్రిటీష్ వాడేమో క్రిమినల్‌గా చిత్రీకరించాడు. మన పాలకులేమో వడ్డెరలను ఇంకా చిన్నచూపే చూస్తుండటం విచారకరం.
వెన్నెలకంటి రిపోర్టులు, అయ్యంగార్ సిఫార్సులు
వెన్నెలకంటి రాఘవయ్య మాత్రం క్రిమినల్ ట్రైబ్స్ గురించి స్టడీ చేసి నాలుగైదు రిపోర్టులు కేంద్రానికి ఇచ్చి ఎస్టీల్లో చేర్చాలని సూచించారు. దురదృష్టమేమిటంటే, గ్రామానికి బయట ఉండే వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చకపోవడం తీరని అన్యాయం. వడ్డెరలవి సంచారజాతి లక్షణాలు. వడ్డెరలు అడవిలో ఉండరు. జనం మధ్యలోనే ఉంటారు. కానీ ఊరి బయట ఉంటారు. ఫారెస్ట్ ట్రైబ్స్ అడవిలో ఉంటారు. ఈ తేడాను చూపించి షెడ్యూల్ ట్రైబ్ జాబితాలో వడ్డెరలను చేర్చలేదు. అయ్యంగారి కమిషన్ 1948లో వేశారు. ఈయన క్రిమినల్ ట్రైబ్స్ పరిస్థితి మరీ దారుణంగా ఉందని ఆ పేరు మార్చాలని ప్రభుత్వానికి సూచించారు. క్రిమినల్ ట్రైబ్ పదాన్ని 1952 ఆగస్టులో ఎత్తివేశారు. వడ్డెరల కోసం ఏ చట్టం లేదు. ఎందులో పడితే అందులో కలిపారు. ఎందుకంటే, చెప్పే వాళ్లు లేరు. కానీ జాతీయ నాయకులైన వెన్నెలకంటి వడ్డెరల బాధల్ని చూసి.. కూడు, గూడు, గుడ్డలు లేకుండా తిరుగుతున్నారని వారిని పైకి తీసుకరావాలని నోమాడిక్ ట్రైబ్స్ మీద మూడో నాలుగో రిపోర్టులు రాసి వారందరినీ ఎస్టీల్లో కలపండంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లిస్ట్‌ను కేంద్రానికి పంపింది. కానీ కేంద్రం ఒప్పుకోలేదు. 1980లో వీరంతా బీసీలు అయిపోయారు. ఇది నొమాడిక్ ట్రైబ్స్ చరిత్ర.
రేణకే కమిటీ సిఫార్సులు అమలు చేయాలి
స్వాతంత్ర్యానికి ముందు నుంచి పలువురు సంఘసంస్కర్తల కృషివల్ల, స్వాతంత్ర్యం వచ్చాక1952 ఆగస్టు 31న 1871 నేరస్తుల జాతుల చట్టాన్ని రద్దు చేశారు. ఏళ్లు గడుస్తూనే ఉన్నాయి. వివిధ చట్టాలు, కమిటీలు వచ్చిపోయాయి. సంచారజాతుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేశాయి. కానీ ఈ జాతులకు ఒరిగిందేమిలేదు.1970 కాలంలో లంబాడ, ఎరుకల కులాలను ఎస్‌టి జాబితాలో చేర్చారు. మిగతా కులాలను వదిలేశారు. కారణం సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఈ తెగలల్లో ఎవరులేక పోవడం. 2004లో జస్టిస్ మోతిలాల్ రాథోడ్ అధ్యక్షతన జాతీయ కమిషన్‌ను అప్పటి కేంద్రప్రభుత్వం వేసింది. 2006 లో మహారాష్ట్రకు చెందిన జస్టిస్ బాలకృష్ణ రేణకే అధ్యక్షతన రెండో కమిటీని యూపీఏ వేసింది. దేశవ్యాప్తంగా తిరిగి ఆయాజాతుల స్థితిగతులపై అధ్యయనం ఈ కమిటీ చేసింది. సంచార జాతుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు రేణకే కమిటీ 76 సిఫార్సులతో 2008లో నివేదికను తయారు చేసింది. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు సమర్పించింది. అయినా ఆ కమిషన్ సిఫార్సులను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోలేదు. ప్రస్తుతమున్న ఎన్డీఏ ప్రభుత్వమైనా దృష్టిసారించి సంచార జాతులను మెరుగుపరిచేందుకు బాలకృష్ణ రేణకే కమిటీ సిఫార్సులను అమలు పర్చాల్సిన అవసరముంది.