- సర్కారు ఉద్యోగ సాధనలో అక్కన్నపేట ప్రత్యేకం
- ఎక్కువ శాతం మంది టీచర్ ఉద్యోగాలపై ఆసక్తి
- ప్రతి డీఎస్సీలోనూ సత్తా చాటుతున్న అభ్యర్థులు
మెదక్ జిల్లాలో ఉన్న వందలాది గ్రామాల్లో అక్కన్నపేటకు ఓ ప్రత్యేకత ఉంది. రామాయంపేట మండలంలోని అక్కన్నపేట గ్రామం ప్రభుత్వ ఉద్యోగులకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఒకరిని చూసి మరొకరు అన్నట్టు గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించిన వారిని ప్రేరణగా తీసుకుని సర్కారు ఉద్యోగాలు సాధించారు.
ఊరిలో దాదాపు 200 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా అందులో ఎక్కువ మంది టీచర్లు ఉండటం విశేషం. కొన్ని ఫ్యామిలీల్లో భార్యా భర్తలు ఇద్దరూ టీచర్ ఉద్యోగాలు సాధించారు. ప్రతీ డీఎస్సీలోనూ ఈ ఊరి అభ్యర్థులు ప్రతిభ చూపి టీచర్ ఉద్యోగాలకు సెలక్ట్ అవుతుండటం మరో విశేషం.
మెదక్, రామాయంపేట, వెలుగు: అక్కన్నపేట గ్రామంలో 1,010 కుటుంబాలు ఉన్నాయి. గ్రామ జనాభా 4,545. ఒకరిని చూసి మరొకరు అన్నట్టుగా ఆ ఊరిలో ఉన్నత చదువులు చదివిన వారిలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి చూపుతున్నారు. ఒకరిద్దరు కాదు.. గ్రామంలో మొత్తం174 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం విశేషం. పంచాయతీరాజ్ శాఖలో పది మంది పంచాయతీ సెక్రటరీలుగా పనిచేస్తుండగా, ఫారెస్ట్, పోస్టల్, ఆర్టీసీ తదితర డిపార్ట్మెంట్లలో ఉద్యోగులు ఎంపికయ్యారు.
ఎక్కువ శాతం టీచర్లే. గ్రామంలో అన్ని వర్గాల వారు ఉన్నారు. వారు వీరనే తేడా లేకుండా అందరూ ప్రభుత్వ ఉద్యోగాల వైపు, అందులోనూ సొసైటీలో గౌరవ ప్రదమైన టీచర్ లుగా స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారు.
ప్రతీ డీఎస్సీలోను ఐదారుగురు టీచర్ పోస్టు లు సాధిస్తుండటం విశేషం. 2008 డీఎస్సీలో అక్కన్నపేట గ్రామానికి చెందిన 18 మంది టీచర్లుగా సెలక్ట్ అయి రికార్డు నెలకొల్పారు. గడచిన 20 ఏళ్లలో 50 మంది టీచర్ ఉద్యోగాలు సాధించారు. 2024 డీఎస్సీలో ఎస్జీటీ విభాగంలో ఇద్దరు సెలెక్ట్ కాగా, స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ విభాగంలో ఓ అభ్యర్థి జిలాస్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. గ్రామంలో పీజీ, బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన వాళ్ళు 200 మందికి పైగా ఉన్నారు. వారిలో చాలా మంది టీచింగ్ వైపు మొగ్గుచూపుతున్నారు. 15 మంది ప్రైవేట్ స్కూల్ లలో టీచర్లుగా, కాలేజీ లెక్చరరర్లుగా పని చేస్తున్నారు.
టీచర్లకు ప్రసిద్ధి
మా గ్రామం నుంచి 2008 డీఎస్సీలో 18 మంది టీచర్లుగా సెలెక్ట్ అయ్యారు. అదే డీఎస్సీలో నేను ఎస్జీటీ విభాగంలో టీచర్ ఉద్యోగం సాధించా. ప్రస్తుతం మా గ్రామం నుంచి సుమారు 60 మంది టీచర్లు పనిచేస్తున్నారు. మరో 50 మందికి పైగా రిటైర్డ్ టీచర్లు ఉన్నారు. కృష్ణ గౌడ్, అక్కన్నపేట
భరోసా ఉంటుందని ..
నేను శాలిపేట పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్నాను. మా విలేజ్ లో టీచర్లే కాకుండా వివిధ శాఖలలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. పీఆర్ డిపార్ట్మెంట్ లో 11 మంది పంచాయతీ సెక్రటరీ లుగా ఉద్యోగం సాధించాం. జీతానికి, జీవితానికి భరోసా ఉంటుందని ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి చూపుతున్నారు. - సంతోష్ , అక్కన్నపేట
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నుంచి.
నేను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా ఉద్యోగం చేసే వాడిని. అయితే నాకు టీచర్ కావాలనే కోరిక ఉండేది. దాంతో అటు ఆ ఉద్యోగం చేస్తూనే ఇటు డీఎస్పీకి ప్రిపేర్ అయ్యా. పట్టుదలతో చదివి 2024 డీఎస్సీలో ఫిజిక్స్ విభాగంలో డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ సాధించా. మా ఊర్లో ఏ గల్లీకి వెళ్లినా టీచర్లు, లేదా రిటైర్డ్ టీచర్లు ఉంటారు. వాళ్ల మోటివేషన్‌తో ఈరోజు నేను టీచర్ అయ్యాను. - నవీన్, అక్కన్నపేట