అడవి తల్లి ఒడిలో నివసించే ఆదివాసీ తెగలు జరుపుకునే పండుగలు ఎన్నో ఉంటాయి. కానీ అందులో నాగోబా గోండు దేవత జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. అది గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు నిలువెత్తు నిదర్శనమని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రకృతిని పూజిస్తూ, పర్యావరణాన్ని కాపాడుతూ భవిష్యత్ తరాలకు ఈ జాతర ఒక సందేశాన్ని ఇస్తుంది. ఇది దేశంలోనే రెండో అతి పెద్ద గిరిజన జాతర. 15 రోజులపాటు జరిగే ఈ గిరిజనుల పండుగను మేస్రం వంశీయులు ఎన్నో ఏండ్లుగా ఆనవాయితీగా నిర్వహిస్తూ వస్తున్నారు.
మేస్రం వంశీయుల ఆరాధ్య దైవం
గిరిజనుల్లో మేస్రం వంశీయుల ఆరాధ్యదైవం నాగోబా గోండుల దేవత. నాగోబా దేవాలయం ఆదిలాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ గ్రామంలో ఉంది. సర్పజాతిని పూజించడమే ఈ పండగ ప్రత్యేకత. నాగోబా దేవతకు పూజలను మేస్రం వంశీయులే నిర్వహిస్తారు. మేస్రం వంశం కింద 22 తెగలు ఉన్నాయి. అక్కడున్న ఏడుగురు దేవతలను కొలిచే మడావి, మర్సకోల, పుర్క, మేస్రం, వెడ్మ, పంద్రా, పుర్వెత ఇంటి పేర్లు గల వారంతా మేస్రం వంశీయుల కిందికి వస్తారు. ఏడాదికి ఒక్కసారి బంధువులను కలుసుకోవడంతోపాటు కొత్త ఏడాదికి స్వాగతం పలకడం, పితృ దేవుళ్లను స్మరించుకోవడం ఈ పండుగ ప్రత్యేకత.
నాగ దేవతే ఆరాధ్య దైవం
వందల ఏండ్లుగా అడవి బిడ్డల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న నాగోబా దేవత జాతర ఏటా పుష్యమాసంలో 15 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ సమయంలో ఆదిలాబాద్ జిల్లాతో పాటు తెలుగు రాష్ట్రాలు, ఒడిశా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి బంధు మిత్రులను కూడగట్టుకొని భారీ సంఖ్యలో గిరిజనులు ఇక్కడికి వస్తారు. పుష్య అమావాస్య రోజున ప్రత్యేక పూజలతో జాతర సందడి మొదలవుతుంది. ఈ పూజలు ఒకే వంశస్తుల చేతుల మీదుగా జరగడం అనాదిగా వస్తున్న ఆచారం. జాతర ప్రారంభానికి ముందు పుష్య పౌర్ణమి రోజున మేస్రం వంశీయులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ పూజలకు అవసరమయ్యే మట్టి కుండల్ని తరతరాలుగా ఒకే వంశస్తులు చెయ్యడం ఆచారంగా వస్తోంది. మేస్రం వంశస్తులు వారం పాటు జాతర ప్రచారం చేసి గంగా జలం కోసం కేస్లాపూర్ నుంచి బయలుదేరతారు. కాలినడకన 125 కిలోమీటర్లు ప్రయాణించి జన్నారం మండలం కలమడుగు సమీపంలోని హస్తిన మడుగులోని నీటిని కలశంలో నింపుకుని తీసుకొచ్చి గ్రామ శివారులోని మర్రి చెట్ల కింద బస చేస్తారు. అక్కడే మేస్రం వంశీయుల్లోని 22 తెగల్లో మృతి చెందిన పితృదేవతలకు తూం(కర్మకాండ) పూజలు నిర్వహిస్తారు. తర్వాత డోలు, సన్నాయిలు వాయిస్తూ నాగోబా ఆలయానికి వెళ్లి నాగోబా విగ్రహాన్ని ఆ నీటితో శుభ్రం చేసి, ఆలయాన్నంతా శుద్ధి చేస్తారు. బాజాభజంత్రీలతో ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రత్యేక పూజ సమయంలో మొలకెత్తిన నవ ధాన్యాలను తెస్తారు. ఒక రాగి చెంబులో పాలను తీసుకుంటారు. నవధాన్యాలు, మొలకలు, పాలు అన్నిటినీ ఒక కొత్త రుమాలుతో కప్పి పుట్టపైన ఉంచుతారు. పుట్టమీది రుమాలు ‘పైకెత్తినట్లు’ కనిపిస్తే పూజా కార్యక్రమాన్ని ఆరంభించినట్టు లెక్క. ఇప్పటికీ నాగదేవుడు రాగి చెంబులోని పాలు తాగుతాడని వాళ్లు బలంగా నమ్ముతారు.
మేస్రం వంశ మహిళల ప్రత్యేకత
నాగోబా జాతర సమయంలో చేసే పూజల్లో మేస్రం వంశ ఆడపడుచులు, అల్లుళ్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆలయంలో పుట్టలు తయారు చేసే మట్టిని టేకు కర్రలతో అల్లుళ్లు తవ్వితే, ఆడపడుచులు పురాతన బావి నుంచి తీసుకొచ్చిన నీటితో మట్టిని మెత్తగా చేసి పుట్టలా తయారు చేస్తారు. వీటికి అయ్యవారు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆడపడుచులు చేసిన పుట్ట ఐదు రోజుల పాటు పగలకుండా ఉంటే ఆ ఏడాది పంటలు బాగా పండుతాయని, తల్లిదండ్రులూ, తోడబుట్టినవారూ బాగుంటారనేది వారి నమ్మకం. జాతర సమయంలో 22 తెగలకు చెందిన కొత్త కోడళ్లందరికీ కులదేవతను పరిచయం చేసి, మొక్కులు తీర్చడం, కుల పెద్దలను పరిచయం చెయ్యడం మరో పద్ధతి. దీనినే బేటింగ్ విధానం అంటారు. చివరగా ఆటపాటలూ, కర్రసాములు, సంప్రదాయ నృత్యాలతో వేడుకను ఘనంగా ముగిస్తారు.
గిరిజన దర్బార్
80 ఏండ్ల క్రితం మారుమూల గ్రామాలకు ఎలాంటి సౌకర్యాలు లేవు. నాగరికులంటేనే ఆదివాసీలు పరుగెత్తేవారు. గిరిజనుల వద్దకు కూడా అధికారులెవరు వెళ్లేవారు కాదు. భూమి కోసం, విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి కుమ్రం భీం మరణించారు. తర్వాత నిజాం ప్రభువు గిరిజనులను శాంతింపజేయడం కోసం, గిరిజన ప్రాంతాల పరిస్థితులు, గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమండాఫ్ను ఆదిలాబాద్ జిల్లాకు పంపారు. ఆయన ఈ జాతరపై దృష్టి పెట్టి.. కొండలు, కోనలు దాటి వచ్చి గిరిజనుల సమస్యలను తెలుసుకొని.. వాటిని పరిష్కరించేందుకు జాతరలో దర్బార్ ఏర్పాటు చేయాలనుకుని, 1942లో మొదట ఈ దర్బార్ నిర్వహించారు. స్వాతంత్ర్యం వచ్చాక దీన్ని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. అక్కడికి వచ్చిన గిరిజనులు వారి సమస్యలను దర్బార్‌లో చెప్పుకుంటారు. జాతర చివరి రోజున ఈ దర్బార్‌కు గిరిజన పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతారు.
ప్రభుత్వం మరిన్ని వసతులు కల్పించాలె..
ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరల్లో ఒకటిగా వెలుగొందుతున్న నాగోబా పండుగను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయి పండుగగా గుర్తించినప్పటికీ అంగరంగ వైభోగంగా ఈ వేడుకలను నిర్వహిస్తే బాగుంటుంది. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే ఈ జాతరకు తగినంత భద్రత కల్పించాలి. ప్రథమ చికిత్స కేంద్రాలను, మంచి నీళ్లు, మొబైల్ బాత్రూంలను ఏర్పాటు చేసి, వృద్ధులకు, చిన్నపిల్లల తల్లులకు భరోసాను ఇవ్వాలి. కొన్ని వేల ఏండ్లుగా మొక్కుతున్న సమ్మక– సారక్క, నాగోబా జాతరల్లోని ఆచార వ్యవహారాలను ముందు తరాలకు అందించి పర్యావరణాన్ని, పురాతన చరిత్ర కలిగిన గిరిజన సంస్కృతిని కాపాడుకోవాలి. అప్పుడే పూర్వీకులకు నిజమైన వారసులం, చరిత్రను కాపాడినవాళ్లం అవుతాం.