గ్రూప్ 1 మెయిన్స్​కు ఎంపికైన వారిలో.. ఓసీలు 3 వేలు.. బీసీలు 17 వేలు

గ్రూప్ 1 మెయిన్స్​కు ఎంపికైన వారిలో.. ఓసీలు 3 వేలు.. బీసీలు 17 వేలు
  • అభ్యర్థుల వివరాలు వెల్లడించిన టీజీపీఎస్సీ 
  • ప్రిలిమ్స్ నుంచి 1:50లో మెయిన్స్​కు 31,383 మంది ఎంపిక 
  • వీరిలో ఓసీలు 3,076.. బీసీలు 17,921 మంది 
  • ఎస్సీలు 4,828, ఎస్టీలు 2,783,  ఈడబ్ల్యూఎస్​లో 2,774 మంది ఉన్నట్టు వెల్లడి
  • గ్రూప్ 1 మెయిన్స్​కు 21,093 మంది హాజరు 
  • ఒక్కో పోస్టుకు 37 మంది పోటీ 

హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 1 మెయిన్స్​కు సెలక్ట్ అయిన వారి వివరాలను టీజీపీఎస్సీ వెల్లడించింది. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు ఏ కేటగిరీకి చెందిన వారు ఎంతమంది క్వాలిఫై అయ్యారనే వివరాలను ఆదివారం ప్రకటించింది. ఒక్కో పోస్టుకు 1: 50 రేషియోలో గ్రూప్ 1 మెయిన్స్​కు మొత్తం 31,383 మంది క్వాలిఫై అయ్యారు. వీరిలో ఓసీలు 3,076 మంది ఉన్నారు. అత్యధికంగా బీసీలు17,921 మంది అర్హత సాధించగా, ఎస్సీలు 4,828 మంది, ఎస్టీలు 2,783 మంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2,774 మంది క్వాలిఫై అయ్యారు. పీడబ్ల్యూడీ కేటగిరీలో మెయిన్స్​కు 1,299 మందిని ఎంపిక చేశామని, కానీ వారిని ఆయా కమ్యూనిటీల్లో చూపించామని టీజీపీఎస్సీ పేర్కొంది.  

గ్రూప్ 1 ఎగ్జామ్స్ పూర్తి.. 

గ్రూప్1 పరీక్షలు పూర్తయ్యాయి. ఈ నెల 21న ప్రారంభమైన మెయిన్స్ పరీక్షలు ఆదివారం ముగిశాయి. రాష్ట్రంలో మొత్తం 563 పోస్టులకు గ్రూప్‌‌1 నోటిఫికేషన్‌‌ విడుదలైంది. మొత్తం 31,383 మంది అభ్యర్థులు మెయిన్స్‌‌కు అర్హత సాధించారు. మరో 20 మంది స్పోర్ట్స్ క్యాండిడేట్లు పరీక్ష రాసేందుకు ప్రత్యేకంగా కోర్టు నుంచి అనుమతి పొందారు. అయితే, మొత్తం వారం రోజుల పాటు కేవలం 21,093 (67.17%) మంది మాత్రమే పరీక్షలకు అటెండ్ అయినట్టు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ ప్రకటించారు. 

ఈ లెక్కన ఒక్కో పోస్టుకు 37 మంది పోటీలో ఉన్నట్టయింది. అయితే, చివరి రోజు ఆదివారం 21,151 మంది హాజరయ్యారు. కాగా, ఇప్పటికే రెండుసార్లు గ్రూప్1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత రద్దు అయింది. తాజాగా మూడోసారి ప్రిలిమ్స్ రాసి.. చివరికి మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా పూర్తికావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

 మేడ్చల్​లోనే ఎక్కువ..

మూడు జిల్లాల పరిధిలో 46 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి టీజీపీఎస్సీ అధికారులు పరీక్షలు నిర్వహించారు. దీంట్లో హైదరాబాద్ జిల్లాలో 5,613 మందికి గాను  4,719 మంది అటెండ్ కాగా, రంగారెడ్డి జిల్లాలో 8,011 మంది అభ్యర్థులకు 5,505 మంది పరీక్షలు రాశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 17,779 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా, 10,869 మంది  రాసినట్టు కమిషన్ సెక్రటరీ వెల్లడించారు. 

మెయిన్స్ అభ్యర్థుల అటెండెన్స్ వివరాలను చీఫ్ సూపరింటెండెంట్ నుంచి సేకరించిన వివరాల ప్రకారం ఇచ్చామని, చిన్నచిన్న మార్పులు ఏమైనా ఉండొచ్చని పేర్కొన్నారు. కాగా, గ్రూప్ 1లో 5% అన్‌‌‌‌ రిజర్వ్‌‌‌‌డ్ పోస్టులకు  మొత్తం 2,550 మంది అభ్యర్థులతో షార్ట్‌‌‌‌లిస్ట్ చేసినట్టు చెప్పారు. దీంట్లో 182 మంది నాన్-లోకల్ అభ్యర్థులు ఉన్నారు.