జీవిత, వైద్య బీమా ప్రీమియంలపై 18 శాతం వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లేఖ రాశారు. లైఫ్, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై 18 శాతం జిఎస్‌టిని తగ్గించాలని ఆ లేఖలో కోరారు. ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై పన్ను విధించడం అంటే.. ఒక వ్యక్తి కష్టం, అనారోగ్యంపై పన్ను విధించినట్లేనని తెలిపారు.
అదే విధంగా వైద్య బీమా ప్రీమియం రంగంపై 18% జిఎస్‌టి తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందన్నారు. జీవిత, వైద్య బీమా ప్రీమియంపై జీఎస్టీ చెల్లించడం సీనియర్ సిటిజన్లకు పెద్ద సవాలుతో కూడుకున్నదని తెలిపారు. ఈ అంశంపై పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై నాగ్‌పూర్ డివిజనల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ తనకు మెమోరాండం సమర్పించిందని లేఖలో పేర్కొన్నారు.
కాగా... ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీని పునపరిశీలించాలని నిర్మలా సీతారామన్‌కు గతంలో పలు మార్లు అభ్యర్థనలు వచ్చాయి. వ్యక్తిగత ఆరోగ్య పాలసీలపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని ఈ ఏడాది జూన్‌లో కాన్ఫెడరేషన్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
సామాజిక భద్రతకు కొలమానంగా ఈ పాలసీలను కొనుగోలు చేసేలా ప్రజలను ప్రోత్సహించడంలో మీరు చేసే తగ్గింపు సహాయపడుతుందని నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ల సంఘం తెలిపింది. పెరిగిన పన్నుల రీత్యా గత 5 సంవత్సరాలలో ఆరోగ్య బీమా ప్రీమియం దాదాపు రెండింతలు పెరిగిందని.. దీంతో పాలసీలు తీసుకునేవారి సంఖ్య గణనీయంగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది.
కొంతమంది ఆరోగ్య బీమా పాలసీలు తీసుకున్నా మళ్లీ రెన్యువల్ చేసుకోవడం లేదని.. రెన్యువల్ చేసుకున్న వారు 65 నుంచి 75 శాతం వరకే ఉంటుందని పేర్కొంది. బీమా ప్రీమియంలను తరచుగా పెంచడం, ఎక్కువ జీఎస్‌టీ రేటు కారణంగా చాలా మంది పాలసీదారులు ప్రీమియం చెల్లించలేకపోతున్నారని సంఘం పేర్కొంది.